కోటి రూపాయలతో జాన్ పహాడ్ దర్గా అభివృద్ధి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోటి రూపాయలతో జాన్ పహాడ్ దర్గా అభివృద్ధి :  ఉత్తమ్ కుమార్ రెడ్డి

నేరేడుచర్ల(పాలకవీడు), వెలుగు: జాన్ పహాడ్ దర్గాను రూ. కోటితో అభివృద్ధి చేస్తానని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.  పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సులో భాగంగా శుక్రవారం నిర్వహించిన గంధోత్సవంలో పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌ నుంచి తెచ్చిన గంధం, దర్గా ముజావర్‌‌‌‌ ఇంటి నుంచి తీసుకొచ్చిన గంధాన్ని చందల్ ఖానాలో ఉంచారు.

 తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై ఊరేగించారు. అనంతరం ముస్లింలు గంధాన్ని తీసుకొని కల్మెట్ తండా, జాన్ పహాడ్, చెరువు తండా ఊరేగించారు.  మంత్రి సైతం కొద్దిసేపు గంధాన్ని ఎత్తుకున్నారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  గత ప్రభుత్వంలో ఆర్భాటాలు తప్ప అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మిషన్ భగీరథ పేరుమీద రూ.40 వేల కోట్లు అప్పు తెచ్చారని,  కృష్ణానది పక్కన ఉన్న గ్రామాలకు కూడా నీళ్లు రావడం లేదని మండిపడ్డారు.

విద్యుత్‌‌ రంగంపై రూ.90 వేల కోట్లు ఇరిగేషన్‌‌పై రూ.2 లక్షల కోట్లు, సివిల్‌‌ సప్లై శాఖపై రూ.58 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ. 94 వేల కోట్లు ఖర్చుపెట్టి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు.  తాగునీటి కోసం సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పారు.