
పౌరీలో కుటుంబ కార్యక్రమానికి హాజరైన యూపీ సీఎం
తల్లి సావిత్రి దేవికి పాదాభివందనం చేసిన యోగి
తండ్రి చనిపోయినా చివరి చూపునకు నోచుకోని సీఎం
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుమారు 28 ఏళ్ల తర్వాత తమ సొంతూరులో అడుగుపెట్టారు. తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు. యోగి సొంతూరు ఉత్తరాఖండ్‌లోని పౌరీ. సుమారు 28 ఏళ్ల తర్వాత ఆయన ఆ ఊరిలో అడుగుపెట్టారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక యోగి తన తల్లిని కలవడం ఇదే తొలిసారి. అందుకే ఆమె ఆశీర్వాదం తీసుకుని ఆప్యాయంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను యోగినే స్వయంగా ట్వీట్టర్‌లో షేర్ చేశారు. ‘అమ్మ’ అనే క్యాప్షన్ పెట్టారు.
బుధవారం (ఈనెల 4న) యోగి మేనల్లుడి తలనీలాలు తీసే కార్యక్రమం ఉంది. అందుకోసమే ఆయన సొంతూరికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా ఒక అధికారిక కార్యక్రమం బదులు సొంత పని మీద వెళ్లడం ఆయనకు ఇదే తొలిసారి అంటున్నారు. కరోనా టైంలో (ఏప్రిల్ 2020) హరిద్వార్‌లో తన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు యోగి హాజరు కాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా టైంలో 23 కోట్ల మందికి తండ్రిగా బాధ్యతలు తనపై ఉన్నాయని, అలాంటిది తానే కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ఎలా అంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.
కుటుంబ సభ్యులను కలవడానికి ముందు పౌరీ జిల్లా కేంద్రంలోని మహాయోగి గురు గోరఖ్‌నాథ్ ప్రభుత్వ కళాశాలలో తన ఆధ్యాత్మిక గురువైన మహంత్ వైద్యనాథ్ విగ్రహాన్ని యూపీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యోగి ఉద్వేగానికి లోనయ్యారు. 1940 తర్వాత తాను జన్మించిన స్థలంలో తన ఆధ్యాత్మిక గురువు విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.
माँ pic.twitter.com/3YA7VBksMA
— Yogi Adityanath (@myogiadityanath) May 3, 2022