
ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్‌లో 42 మంది కరోనా వైరస్ రోగులు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. వారంతా కోవిడ్-19 టెస్ట్ చేయించుకున్న సమయంలో తమ మొబైల్ నంబర్లు, అడ్రస్ లను తప్పుగా ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. జిల్లా అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ఎ.సి.ఎం.ఓ) డాక్టర్ కెకె వర్మ దీనిపై స్పందిస్తూ.. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన 42 మంది కనిపించడం లేదని అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. కోవిడ్ టెస్ట్ ల సమయంలో కొంతమంది సరైన మొబైల్ నంబర్ మరియు చిరునామాను ఇవ్వనందున, పాజిటివ్ గా వచ్చిన వారి అడ్రస్ లను కనిపెట్టడం తమకు కష్టమవుతుందని తెలిపారు.
అయితే గత 15 రోజుల నుండి జిల్లాలో కొంతమంది కోవిడ్ -19 రోగులు తప్పిపోయినట్లు సమాచారం. తప్పిపోయిన వారి సంఖ్య 40 దాటడంతో జిల్లా ఆరోగ్య శాఖ తీవ్రంగా పరిగణించింది. ఇప్పటివరకు, ఘాజిపూర్ జిల్లాలో 10 మంది కోవిడ్ -19 కారణంగా మరణించగా.. 505 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.