
ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని హజ్రత్‌గంజ్ మెట్రో స్టేషన్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ కాల్ తమకు రాత్రి అందిందని అధికారులు తెలిపారు. ఫోన్ కాల్ రావడంతో మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
జూలై 7న రాత్రి హజ్రత్‌గంజ్ మెట్రో స్టేషన్‌ను పేల్చివేయాలని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చిందని హజ్రత్‌గంజ్ ఏసీపీ అరవింద్ కుమార్ వర్మ తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి తన పేరు రమేష్ శుక్లా అని చెప్పాడని, స్టేషన్‌ను పేల్చివేసేందుకు ప్లాన్ చేశాడని, దాని వెనుక బండా నివాసి దినేష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడని చెప్పినట్టు తెలిపారు.
'బాంబు దొరకలేదు'
బెదిరింపు కాల్‌తో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. అయితే బాంబు గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో పోలీసులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ మెట్రో స్టేషన్‌లోని ప్రతి మూలను పోలీసులు తనిఖీ చేశారు.
మెట్రో స్టేషన్ల వద్ద బాంబును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు డాగ్ స్క్వాడ్‌లతో చేరుకున్నారు. వాస్తవానికి స్టేషన్‌లో బాంబు ఉందని, రాత్రి 11.40 గంటలకు అది పేలుతుందని ఆ వ్యక్తి ఫోన్‌లో చెప్పాడు. పోలీసులు అర్థరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి బాంబు లభించలేదు. మెట్రో స్టేషన్ మొత్తం సోదాలు చేశామని, అర్థరాత్రి వరకు ఎలాంటి బాంబు లభ్యం కాలేదని, విచారణ కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు.