యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్​ ఆమోదం

యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్​ ఆమోదం
  • బిల్లు తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా రికార్డు
  • గవర్నర్​ ఆమోదం తర్వాత చట్టంగా మారనున్న బిల్లు

న్యూఢిల్లీ: యూనిఫాం సివిల్​ కోడ్(యూసీసీ) బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ​రికార్డు సృష్టించింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్ట రూపం దాల్చనుంది. యూసీసీ బిల్లు ఆమోదం కోసమే ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది.

మంగళవారం సీఎం పుష్కర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ధామీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బుధవారం బిల్లుపై చర్చ తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సమావేశాల తర్వాత సీఎం పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న బిల్లు ఎట్టకేలకు అసెంబ్లీలో ఆమోదం పొందిందని, ఈ రోజు ఉత్తరాఖండ్​కు ప్రత్యేకమైన రోజని అన్నారు. వివాహం, విడాకులు వంటి విషయాల్లో మహిళలపై ఉన్న వివక్షను ఈ బిల్లు తొలగిస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు, యూసీసీ బిల్లుపై చర్చ సందర్భంగా పుష్కర్ సింగ్ ధామీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. యూసీసీని తమ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ప్రవేశపెట్టిందని అన్నారు. 

బిల్లులో ఏమున్నాయి?

వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం యూసీసీ బిల్లు ఉద్దేశించింది. సహ జీవనానికి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. ఈ బిల్లు నుంచి గిరిజనులను మినహాయించారు. 21ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులు సహ జీవనం చేయాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.

అయితే నైతికతకు విరుద్ధంగా ఉన్న సహ జీవనాలను రిజిస్టరు చేయరు. సహ జీవనం చేయాలనుకున్న ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగినా, మైనర్‌‌‌‌‌‌‌‌ అయినా సహ జీవనం సంబంధాలను రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేయరు. సహ జీవనం గురించి తప్పుడు సమాచారం ఇస్తే 3 నెలల జైలు, రూ. 25 వేల జరిమానా విధిస్తారు. సహ జీవనాన్ని రిజిస్టర్​ చేయించకపోతే రూ.25 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు.