యువతను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు

యువతను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు

డెహ్రాడూన్: అగ్నిపథ్ విషయంలో ప్రతిపక్షాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆరోపించారు. అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సోమవారం మాజీ సైనికాధికారులతో సీఎం పుష్కర్ సింగ్ ధామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనల్ని  రక్షించడానికి ఇండియన్ ఆర్మీ రక్షణ కవచంలా నిలుస్తోందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరం అదృష్టంగా భావించాలని చెప్పారు. అగ్నిపథ్ స్కీం దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తీసుకొచ్చిందని, అయితే కొన్ని పార్టీల నాయకులు కావాలనే ఈ స్కీంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల స్వార్ధ రాజకీయాల కోసం యువతను రెచ్చగొట్టడం సరికాదన్నారు. అగ్నిపథ్ విషయంలో ప్రతిపక్షాలు శత్రు దేశాలతో చేతులు కలిపినట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. స్కీంలో ఏమైనా లోపాలుంటే సలహాలు ఇవ్వాలే తప్ప... అనవసర గందరగోళం సృష్టించొద్దని సూచించారు. ప్రతి పక్షాలుగా మోడీని, అధికార పార్టీని విమర్శించాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని ధామి పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రతి పక్షాలు అగ్నిపథ్ స్కీంను అర్థం చేసుకోవాలని, యువతను రెచ్చగొట్టడం ఆపాలని పుష్కర్ సింగ్ ధామి కోరారు.