
పచ్చని కొండలపై రూ.200కోట్లతో పెళ్లి పార్టీ
చెత్త ఏరేయలేక అధికారుల తంటాలు
ఔలీ : పెళ్లి పేరుతో పచ్చని కొండలను పాడు చేశారు. ఉత్తరాఖండ్ లో జరిగిన రెండు హై ప్రొఫైల్ పెళ్లి వేడుకలు… పర్యావరణాన్ని నాశనం చేశాయి. పెళ్లివేడుక ముగిసిన తర్వాత… ఇపుడు చెత్తను ఏరేసేందుకు మున్సిపల్ అధికారులు కష్టపడుతున్నారు.
సౌతాఫ్రికాకు చెందిన గుప్తా ఫ్యామిలీ.. ఈనెల 18 నుంచి.. 22 మధ్య.. ఉత్తరాఖండ్ లోని ఔలీ హిల్ స్టేషన్ లో రెండు పెళ్లి వేడుకలు నిర్వహించింది. అజయ్ గుప్తా కొడుకు సూర్య కాంత్ పెళ్లి జూన్ 18 నుంచి.. 20 మధ్య జరిగింది. అతుల్ గుప్తా కొడుకు శశాంక్ పెళ్లి జూన్ 20 నుంచి 22 మధ్య జరిగింది.
ఈ రెండూ కూడా హై ప్రొఫైల్ పెళ్లిళ్లు. ముఖ్యమంత్రులు, మంత్రులు, వ్యాపార దిగ్గజాలు, కత్రినా కైఫ్ లాంటి సినీ తారలు ఈ పెళ్లివేడుకకు వచ్చారు. యోగా గురువు రామ్ దేవ్ బాబా అతిథుల కోసం ప్రత్యేకంగా యోగా క్యాంప్ కూడా ఏర్పాటుచేశారు. స్విట్జర్లాండ్ నుంచి ఫ్లవర్స్ తెప్పించారు. కొండల మధ్య స్పెషల్ గా డెకరేట్ చేసి గుడారాలు వేశారు. కలర్ ఫుల్ లైటింగ్.. అదిరిపోయే సౌండ్..ఇలా.. భారీస్థాయిలో మ్యారేజ్ జరిపారు. వీవీఐపీలను హెలికాప్టర్లలో హిల్ స్టేషన్ వేదికవద్దకు తీసుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది. అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది.
ఈ పెళ్లి ఖర్చు రూ.2వందల కోట్లు. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఐతే.. పెళ్లి జరిగాక.. ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోయారు నిర్వాహకులు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉండే ఔలీ హిల్ స్టేషన్ లో ఇపుడు ప్లాస్టిక్ చెత్త పేరుకుపోయింది. ఐదు రోజు పాటు జరిగిన వెడ్డింగ్ పార్టీ కారణంగా.. ప్లాస్టిక్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు ఎక్కడికక్కడే చిందరవందరగా పడిపోయాయి.
ఈ చెత్తను ఏరేసేందుకు నగర పాలిక పరిషత్ సూపర్ వైజర్ జోషిమత్, అనిల్ సహా.. మరో 20 మంది అధికారులను పురమాయించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. క్లీనింగ్ బాధ్యత తీసుకున్న అధికారులు ఇపుడు తలలు పట్టుకుంటున్నారు. అక్కడ పేరుకుపోయిన చెత్త 40 క్వింటాళ్లు దాటిపోయింది.
పశువులు, ఆవులు ఔలీ హిల్ స్టేషన్ కు మేతకు వస్తుంటాయి. అవి వాటిని తింటే.. వాటి అనారోగ్యానికి బాధ్యత ఎవరిది అంటూ స్థానికులు ప్రశ్నించారు. ఇలాంటి హిల్ స్టేషన్లలో పార్టీలకు అనుమతివ్వడమే కరెక్ట్ కాదని స్థానికులు అంటున్నారు.