తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు

తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు

చార్ ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ ఆలయ తలుపులు ఏప్రిల్ 27 గురువారం రోజున తెరుచుకున్నాయి.  ఆలయ సంప్రదాయం ప్రకారం  ఉదయం 7:10 గంటలకు ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ యాత్రికుల కోసం ఆలయ తలుపులను  తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు.  ఆలయ తలుపులు తెరిచే సమయానికి వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు.   వచ్చే ఆరు నెలల పాటు భక్తులు ఈ బద్రీనాథ్  ఆలయాన్ని  దర్శించుకునే అవకాశం ఉంటుంది. చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.  

దేశంలోని ప్రసిద్ధ విష్ణు దేవాలయాలలో  బద్రీనాథ్ ఆలయం ఒకటి.  ఇది  విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అలకనంద నది ఒడ్డున నార, నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ బద్రీనాథ్ విగ్రహం చతుర్భుజ భంగిమలో ఉన్న శాలిగ్రామ శిలతో చేయబడింది. దేశ నలుమూలల నుంచి భక్తులు బద్రీనాథ్ ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.   బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మరికొన్ని రోజులు వర్షాలు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, చార్‌ధామ్ యాత్రను సందర్శించే యాత్రికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నాలుగు పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానం చేసేదే ఈ చార్‌ధామ్ యాత్ర. బద్రీనాథ్ ఆలయం విష్ణువు  కోసం అంకితం చేయబడింది, కేదార్నాథ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. గంగోత్రి ఆలయం గంగాదేవికి, యమునోత్రి ఆలయం యమునా దేవికి అంకితం చేయబడింది.