జోషిమఠ్​ను కాపాడుకుంటం : సీఎం పుష్కర్ సింగ్ ధామి

జోషిమఠ్​ను కాపాడుకుంటం : సీఎం పుష్కర్ సింగ్ ధామి

జోషిమఠ్​ను కాపాడుకుంటం

ఇక్కడున్న 600 ఫ్యామిలీలను తరలిస్తాం

ఉత్తరాఖండ్​లోని జోషిమఠ్​లో సీఎం ధామి రివ్యూ

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో కుంగిపోతున్న జోషిమఠ్ టౌన్ ను కాపాడుకుంటామని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. కల్చర్, రిలీజియన్, టూరిజం పరంగా అతిముఖ్యమైన ప్రదేశమైన ఈ టౌన్ ను రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. నేల కుంగిపోతుండటంతో ఇండ్లు, రోడ్లు బీటలు వారుతున్న జోషిమఠ్ టౌన్ లో శనివారం ఆయన పర్యటించారు. టౌన్ లో నెర్రెలిచ్చిన ఇండ్లు, రోడ్లను పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులు, ఎక్స్ పర్ట్ లతో రివ్యూ నిర్వహించారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, ప్రజల తరలింపు చర్యలపై సమీక్షించారు. టౌన్ లోని నర్సింగ్ ఆలయాన్ని సందర్శించిన ఆయన స్థానిక ప్రజలను ఈ ఆపద నుంచి తప్పించాలంటూ ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జోషిమఠ్ లో ఉన్న 600 కుటుంబాలను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడమే ప్రస్తుతం తమ ప్రభుత్వానికి ప్రయారిటీ అని అన్నారు. టౌన్ ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. లాంగ్ టర్మ్ రీహ్యాబిలిటేషన్ స్ట్రాటజీని కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. జోషిమఠ్ ప్రజలను పిపాల్ కోటి, గౌచార్ ఏరియాలకు తరలించేందుకు స్థలాలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. టౌన్ లో డ్రైనేజ్, సీవేజ్ సిస్టంను వెంటనే మెరుగుపర్చాలని, ఇందుకోసం చేపట్టే పనులు ఆలస్యం కాకుండా నేరుగా తన ద్వారానే క్లియరెన్స్ తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

14 నెలలుగా చెప్తున్నా పట్టించుకోలే..

జోషిమఠ్ లో నేల కుంగుతూ, రోడ్లు, ఇండ్లు దెబ్బతింటున్నాయని 14 నెలల కిందటి నుంచే చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘2021 నవంబర్ లోనే నేల కుంగిపోవడంతో 14 ఇండ్లు ప్రమాదంలో పడ్డాయి. నవంబర్ 16న స్థానికులమంతా కలిసి ర్యాలీ తీశాం. అప్పుడే ప్రభుత్వం స్పందించి ఎక్స్ పర్ట్ టీంలను పంపించి ఉంటే ఇప్పుడు ఈ ముప్పు వచ్చేది కాదు” అని జోషిమఠ్ బచావో సంఘర్ష్​ సమితి కన్వీనర్ అతుల్ సాతి అన్నారు. తపోవన్–విష్ణుగఢ్ హైడల్ ప్రాజెక్టు కోసం జోషిమఠ్ కిందుగానే టన్నెల్ తవ్వుతున్నారని, ప్రస్తుత విపత్తుకు ఈ ప్రాజెక్టే కారణమన్నారు. దీనితో పాటు హేలాంగ్–మార్వాడీ బైపాస్ పనులనూ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.