టన్నెల్​లో చిక్కుకున్న వారి కోసం 6 ఇంచ్​ల పైప్​లైన్​తో.. ఫుడ్, ఆక్సిజన్

టన్నెల్​లో చిక్కుకున్న వారి కోసం 6 ఇంచ్​ల పైప్​లైన్​తో.. ఫుడ్, ఆక్సిజన్
  • టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులకు చపాతీలు, కర్రీ
  • రెస్క్యూ పూర్తయ్యేందుకు మరో ఐదారు రోజులు పట్టే చాన్స్

ఉత్తరకాశి:  టన్నెల్​లో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ సిబ్బంది సోమవారం మళ్లీ ఆహారం పంపించారు. ఆరు అంగుళాల పైప్​లైన్​తో ఫుడ్, ఎమర్జెన్సీ వస్తువులు పంపించారు. 41 మంది టన్నెల్​లో చిక్కుకుపోయి సోమవారానికి ఎనిమిది రోజులు అవుతున్నాయి. అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో ఆహారం పంపించేందుకు ఈ పైప్​లైన్ ఎంతో ఉపయోగపడుతున్నదని రెస్క్యూ సిబ్బంది వివరించారు. ముందు నాలుగు అంగుళాల ట్యూబ్​తో ఫుడ్ సప్లై చేశామన్నారు. తాజాగా మళ్లీ డ్రై ఫ్రూట్స్, మెడిసిన్స్, ఆక్సిజన్ పంపించామని తెలిపారు. చపాతి, కర్రీ కూడా పంపేలా పైప్​లైన్ ఏర్పాటు చేశామని వివరించారు. ఇదొక బ్రేక్ త్రూ అని ఎన్​హెచ్ఐడీసీఎల్ డైరెక్టర్ అన్షు మనిశ్ తెలిపారు. 53 మీటర్ల మేర పైప్​ను లోపలికి పంపించామన్నారు. దీంతో కార్మికులు తాము చెప్పింది వినగల్గుతారని చెప్పారు. అయితే, కార్మికులను కాపాడేందుకు మరో ఐదారు రోజుల సమయం పట్టవచ్చన్నారు.

కార్మికుల మనోధైర్యం కాపాడాలి: ప్రధాని

ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డ్రిక్స్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సహాయక చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీతో ప్రధాని మాట్లాడారు. అవసరమైన రెస్క్యూ పరికరాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నదని మోదీ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని కోరారు. కార్మికుల మనోధైర్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పినట్లుగా ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ప్రకటించింది. సహాయక చర్యల గురించి మోదీకి సీఎం పుష్కర్ ధామీ వివరించినట్లు తెలిపింది.