మరో జన్మెత్తిన కార్మికులు.. క్రాకర్స్ పేల్చి, స్వీట్స్ పంచిన కుటుంబసభ్యులు

మరో జన్మెత్తిన కార్మికులు.. క్రాకర్స్ పేల్చి, స్వీట్స్ పంచిన కుటుంబసభ్యులు

నవంబర్ 28న సాయంత్రం సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులను సురక్షితంగా రక్షించడంతో, దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆనందాన్ని వారు క్రాకర్లు పేల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఘటనాస్థలికి చేరుకుని, అప్పటి నుంచి అక్కడే మకాం వేసిన పలువురు బంధువులు ఎట్టకేలకు తమ ఆత్మీయులను కలుసుకున్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు చివరకు సొరంగం చివర వెలుగును చూడడంతో స్థానికులు కూడా సొరంగం సైట్ వద్ద ఆనందం వ్యక్తం చేస్తూ.. స్వీట్లు పంచుకున్నారు.

కార్మికుల కుటుంబ సభ్యుల స్పందన

సిల్క్యారా సొరంగం నుంచి రక్షించబడిన కార్మికుల్లో ఒకరైన విశాల్ తల్లి ఊర్మిళ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాల పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని, వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఆమె అన్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెస్క్యూ వర్కర్లలో ఒకరైన సంతోష్ కుమార్ బంధువు ఆపరేషన్ తర్వాత తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. బీహార్‌కు చెందిన ఒక కార్మికుడు సోను తల్లి కూడా ప్రభుత్వానికి, రెస్క్యూ టీమ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు చాలా సంతోషంగా ఉందని, రెండు రోజుల తర్వాత తిరిగి వస్తానని నా కొడుకు చెప్పాడని ఆమె అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన, బయటికొచ్చిన కార్మికులలో ఒకరైన మాణిక్ తాలూక్‌దార్ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతనితో సంభాషించారు.  

ఇదే తరహాలో అస్సాం, ఒడిశాలకు చెందిన పలువురు కార్మికుల కుటుంబసభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. రెస్క్యూ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా క్రాకర్లు పేల్చి, స్వీట్లు పంచి తమ ఆనందకరమైన క్షణాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.