సిటీలో యూటర్న్‌‌‌‌ తిప్పలు

సిటీలో యూటర్న్‌‌‌‌ తిప్పలు
  • సిగ్నల్‌‌‌‌ ఫ్రీ జంక్షన్లలో ట్రాఫిక్ జామ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్రేటర్‌‌‌‌‌‌‌‌ సిటీలో ట్రాఫిక్​జామ్​ను నివారించేందుకు పోలీసులు సిగ్నల్‌‌‌‌ ఫ్రీ జంక్షన్స్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సిగ్నళ్లను తొలగించి యూటర్న్స్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండని ప్రాంతాల్లోనూ సిగ్నళ్లను ఎత్తేశారు. వాటి స్థానాల్లో 100 నుంచి 500 మీటర్ల దూరంలో యూ టర్న్‌‌‌‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్​ను నివారిస్తున్నప్పటికీ.. కొన్ని ఏరియాల్లో మంచి ఫలితాలను ఇవ్వడం లేదు. ట్రాఫిక్‌‌‌‌ ఎక్కువగా ఉండే రూట్లు, ఇరుకైన రోడ్లలో రద్దీ ఎక్కువై వెహికల్స్​ ముందుకు కదలక వాహనదారులు నరకం చూస్తున్నారు.

రద్దీ ఏరియాల్లోనే..

ఫ్లై ఓవర్లు, అండర్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌లు ఏర్పాటు చేసిన రోడ్లలో మినహా చాలా ప్రాంతాల్లోని యూ టర్న్‌‌‌‌ల వద్ద ట్రాఫిక్ జామ్‌‌‌‌ అవుతోంది. వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉండే పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌‌‌‌, హైటెక్‌‌‌‌ సిటీ, గచ్చిబౌలి, మెహిదీపట్నం ప్రాంతాల్లో  రద్దీ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. బేగంపేట నుంచి ప్యారడైజ్‌‌‌‌ వరకు 3 యూటర్న్‌‌‌‌లు ఉన్నాయి. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా షాపింగ్‌‌‌‌ కాంప్లెక్సులు, ఫుడ్‌‌‌‌ కోర్టులు ఎక్కువగా ఉండటంతో కస్టమర్ల వెహికల్ పార్కింగ్‌‌‌‌తో ఈ రూట్‌‌‌‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. యూ టర్న్స్‌‌‌‌ తీసుకోవాల్సిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. లక్డీకపూల్‌‌‌‌ నుంచి మెహిదీపట్నం వెళ్లే రూట్‌‌‌‌ మహవీర్ హాస్పిటల్‌‌‌‌ సమీపంలో ఏర్పాటు చేసిన యూ టర్న్‌‌‌‌ వద్ద కూడా ఇదే పరిస్థితి.

బంజారాహిల్స్‌‌‌‌, జూబ్లీహిల్స్ లో ఇరుకుగా..

బంజారాహిల్స్ రోడ్‌‌‌‌ నం.12, జూబ్లీహిల్స్‌‌‌‌ రోడ్‌‌‌‌ నం.45లో ఏర్పాటు చేసిన యూ టర్న్‌‌‌‌లు వాహనదారులకు నరకం చూపుతున్నాయి.  జూబ్లీహిల్స్‌‌‌‌ భారతీయ విద్యాభవన్‌‌‌‌, హార్ట్‌‌‌‌ కప్‌‌‌‌ కేఫ్, జూజోజ్‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌ వద్ద ఏర్పాటు చేసిన యూటర్న్స్‌‌‌‌ ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ అవుతోంది. దీంతో పాటు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ భవన్‌‌‌‌ వద్ద ఉన్న సిగ్నల్‌‌‌‌ను రాత్రి 9.30 గంటల వరకు క్లోజ్‌‌‌‌ చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌‌‌‌ చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌‌‌‌ను క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్ సమీపంలో యూ టర్న్‌‌‌‌ చేస్తున్నారు. ఈ యూటర్న్‌‌‌‌ కూడా ఇరుకుగా ఉండి ట్రాఫిక్ జామ్ ​అవుతోంది.

వాహనదారుల అవస్థలు

ఆఫీసులకు, ఇండ్లకు వెళ్లే సమయాల్లో ఉద్యోగులు ఈ యూటర్న్స్​వద్ద ట్రాఫిక్‌‌‌‌లో చిక్కుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల సమయంలో జర్నీ అంటేనే జంకుతున్నారు. పాయింట్‌‌‌‌ డ్యూటీలో ఉండాల్సిన సిబ్బంది కేవలం సిగ్నల్స్ ఆపరేషన్‌‌‌‌కి మాత్రమే పరిమితవుతున్నారు. దీంతో యూటర్న్స్‌‌‌‌లో ట్రాఫిక్ జామ్‌‌‌‌ అవుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బారికేడ్లు పెట్టి క్లోజ్ చేసిన జంక్షన్లను కూడా సరైన సమయాల్లో ఓపెన్ చేయడం లేదు. భారీగా ట్రాఫిక్ జామ్ అయితే తప్ప బారికేడ్లను తొలగించడం లేదు.

ఇరుకైన యూటర్న్​తో ఇబ్బంది

సిగ్నల్‌‌‌‌ బాధ తప్పుతోందని భావిస్తే ఇప్పుడు యూ టర్న్స్‌‌‌‌ ఇబ్బంది పెడుతున్నయ్. ఇరుకైన రోడ్లపై యూ టర్న్స్‌‌‌‌ పెట్టడం వల్ల కార్లు, బస్సులు టర్న్‌‌‌‌ కావడం లేదు. పెరుగుతున్న వెహికల్స్ కు అనుగుణంగా సిటీ రోడ్ల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్ భారీగా పెరిగిపోతోంది. ఇలాంటి ప్రాంతాల్లో రోడ్లు వైడెనింగ్ చేయాలి. 

- అనుదీప్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, ఫిల్మ్ నగర్

ఈ సమస్యను పరిష్కరించాలె

బేగంపేటలోని ఓ బ్యాంక్‌‌‌‌లో పనిచేస్తున్నా. నేను ట్రావెల్‌‌‌‌ చేసే రూట్‌‌‌‌లో మూడు యూటర్న్స్‌‌‌‌ ఉన్నాయి. అదే ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ కోర్టులకు వచ్చే కస్టమర్లు అడ్డదిడ్డంగా వెహికల్స్ పార్క్‌‌‌‌ చేస్తున్నారు. దీని ప్రభావం యూ టర్న్‌‌‌‌ వద్ద టర్నింగ్‌‌‌‌ తీసుకునే వెహికల్స్‌‌‌‌పై పడుతోంది. సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ యూ టర్న్స్‌‌‌‌ వల్ల కొత్తగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలి.

- భరత్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌,  సంతోష్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌