
- డైమండ్ ప్లే బటన్‌తోపాటు అభినందన లేఖ పంపిన యూట్యూబ్ సంస్థ
హైదరాబాద్, వెలుగు: ప్రేక్షకుల అంతులేని ఆదరణతో ‘V6-’ యూట్యూబ్ చానల్ అరుదైన గుర్తింపు సాధించింది. కోటి మంది సబ్ స్క్రైబర్లను చేరుకున్న చానల్స్‌కు యూట్యూబ్ సంస్థ అందించే ‘డైమండ్’ ప్లే బటన్ ను అందుకుంది. నిరుడు ఫిబ్రవరి మొదటి వారానికే ‘V6- ’ యూ ట్యూబ్ చానల్ కోటి మంది కుటుంబంగా మారింది. ఈ మైలురాయికి గుర్తుగా యూట్యూబ్ సంస్థ ‘డైమండ్ ప్లే బటన్’ తో పాటు సీఈవో అభినందన లెటర్ ను పంపించింది. యూట్యూబ్ అధికారిక సమాచారం ప్రకారం నిరుడు మార్చి చివరి నాటికి ‘V6-’తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 995 చానల్స్ కు మాత్రమే ఈ గౌరవం దక్కింది.
వేగంగా జనాదరణ
2012 మార్చిలో జనం ముందుకొచ్చిన V6 న్యూస్ చానల్ వేగంగా ఆదరణ పెంచుకుంది. 2013 జనవరి 26న V6 న్యూస్ యూట్యూబ్ చానల్ మొదలైంది. ఏడాదిన్నర కాలంలోనే లక్ష సబ్ స్క్రైబర్లకు చేరుకొని 2015 ఆగస్టులో యూట్యూబ్ నుంచి సిల్వర్ క్రియేటర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత మరింత వేగంగా ఆదరణ పెంచుకుంటూ యూట్యూబ్ తెలుగు న్యూస్ చానళ్లలోనే మొదటిసారిగా 10 లక్షల సబ్ స్క్రైబర్లను చేరుకుంది. 2017 సెప్టెంబర్ నాటికి ఈ మార్క్ ను సాధించి యూట్యూబ్ సంస్థ నుంచి గోల్డ్ క్రియేటర్ అవార్డును అందుకుంది. అచ్చమైన వార్తలు, విశ్వసనీయతను ఆదరించే ప్రేక్షకుల అండతో 2024, ఫిబ్రవరి నాటికి కోటి మంది సభ్యులతో అతిపెద్ద కుటుంబంగా మారింది.
వార్తలను వార్తలుగా ఇవ్వడం.. సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సమస్యలకు పెద్దపీట వేయడం.. జనం భాషలో వార్తలు, జనం గొంతుకకు వేదికగా ఉండడమే ‘V6-’ను తెలంగాణ ఇంటి చానల్‌గా నిలబెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సమాజానికి అచ్చమైన వార్తల వేదికగా మారింది. ఇంత ఆదరణ వల్లే ఎట్లాంటి ప్రమోషన్ లేకుండా, ఆర్గానిక్ గా కోటి మందికిపైగా సబ్ స్క్రైబర్లు ‘V6’ యూట్యూబ్ చానల్ ను ఆదరిస్తున్నారు. యూట్యూబ్ వేదికపై న్యూస్- పాలిటిక్స్ విభాగంలో ప్రపంచంలోనే టాప్- 20 చానల్స్ లో ఒకటిగా V6 నిలిచింది. ఇంత గౌరవాన్ని అందించిన సబ్ స్క్రైబర్లు, ప్రేక్షకులు అందరికీ ‘V6-’ శతకోటి వందనాలు చెప్తున్నది.
టీమ్‌గా మైలురాయిని చేరుకున్నారు
యూట్యూబ్ క్రియేటర్లలో ప్రత్యేకమైన గౌరవాన్ని అందుకున్న వారిలో మీరూ(V6 వెలుగు) ఒకరు. మీ వార్తా కథనాలు, సృజనాత్మకతతో లక్షలాది మంది ప్రేక్షకులను ఒక వేదికపైకి తెచ్చారు. ఇది అంత సులువుగా సాధించేది కాదు. టీమ్ గా మీ శ్రమతో, నిలకడైన పనితీరుతో అతితక్కువమంది సాధించే ఈ మైలురాయిని చేరుకున్నారు. అన్నింటికంటే.. ప్రపంచమంతా లక్షలాది మందిని చేరుకునే అతిపెద్ద కమ్యూనిటీని మీరు తయారు చేసినందుకు అభినందనలు.
నీల్ మోహన్, యూట్యూబ్ సీఈవో