కొండగట్టు ఘాట్‌‌ రోడ్డుపై షరా మామూలే..! 67 మంది ప్రాణాలు పోయినా ఇప్పటికీ అదే పరిస్థితి..!

కొండగట్టు ఘాట్‌‌ రోడ్డుపై షరా మామూలే..! 67 మంది ప్రాణాలు పోయినా ఇప్పటికీ అదే పరిస్థితి..!
  • గత సర్కార్ ఒత్తిడి మేరకు చిన్నవాహనాలకు అనుమతి ఇచ్చిన త్రీ మెన్ కమిటీ
  • పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్న ఆటోలు, ట్యాక్సీలతో తరచూ ప్రమాదాలు
  • ప్రమాదం జరిగి ఏడేండ్లయినా నిర్మించని ప్రత్యామ్నాయ రోడ్డు

జగిత్యాల, వెలుగు: కొండగట్టులో 2‌‌‌‌018లో ఘాట్‌‌రోడ్డుపై నుంచి బస్సు బోల్తాపడి 67 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన తర్వాత కొన్నాళ్లూ ఘాట్‌‌ రోడ్డు మూసివేయగా.. వివిధ కారణాలతో 2022లో చిన్న వాహనాలకు అనుమతి ఇచ్చారు. కాగా ఈ వెసులుబాటుతో కొంతమంది వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటూ షరామామూలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అడపాదడపా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నేటికీ ఈ దుర్ఘటన జరిగి 7 ఏండ్లు పూర్తయినా ప్రమాదాల నివారణకు ప్రభుత్వ యంత్రాంగం శాశ్వత పరిష్కారం చూపలేదని భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్రీమెన్‌‌ కమిటీ సిఫార్సులు ఇవీ..
2018లో కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు ప్రమాదంలో 67 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటన అనంతరం ఘాట్ రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు. భారీ వాహనాల కోసం దొంగలమర్రి క్రాసింగ్- నాచుపల్లి జేఎన్టీయూ మార్గాన్ని వినియోగంలోకి తెచ్చారు. ఘటన అనంతరం నాటి సర్కార్ త్రిమెన్‌‌ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ సూచన మేరకు 2022లో రోడ్డుకు రెండువైపులా చిన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ జీవో జారీ చేశారు. దీంతోపాటు  ఘాట్ రోడ్డుపై వాహనాల వేగం గంటకు 20 కిలోమీటర్లకు మించొద్దని, కండీషన్‌‌లో ఉన్న కార్లు, ఆటోలు, బైక్‌‌లను మాత్రమే అనుతించాలని పేర్కొంది.

భారీ వాహనాలు అంటే బస్సులు, మినీ బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలకు పర్మిషన్​ఇవ్వొద్దని సూచించింది.  కొత్త ఘాట్‌‌రోడ్డును నిర్మించాలని కమిటీ సూచించింది. రోడ్డు పరిస్థితులు ఐఆర్సీ ప్రమాణాలందుకునే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘిస్తే వాహన యజమానులు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతోపాటు డ్రైవర్లు మద్యం తాగి డ్రైవింగ్‌‌ చేయకుండా ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు నిరంతరం టెస్ట్‌‌లు చేయాలని చెప్పింది.

కమిటీ సూచనలు గాలికొదిలిన అధికారులు
కాగా త్రీమెన్ కమిటీ సిఫార్సులు క్షేత్ర స్థాయిలో అమలు కాలేదు. కానీ ఈ ప్రతిపాదన నేటికీ అమలుకాలేదు. కారు, జీప్, టూ-వీలర్లకే పరిమితమని చెప్పినా కొన్నాళ్లుగా ట్రాక్టర్‌‌‌‌, ట్రాలీ ఆటోలు, ఇతర భారీ వాహనాలు తిరుగుతున్నాయి. ఆటోలు వంటి చిన్నవాహనాల్లోనూ పరిమతికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు.

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వాహనాలు ఇష్టారాజ్యంగా ఓవర్‌ ‌లోడ్‌‌తో ప్రయాణిస్తూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డులో డ్యూటీ చేయాల్సిన అధికారులు కనిపించకపోవడంపై స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భారీ వాహనాల రాకను అడ్డుకోవాలని, ప్రమాదాలను నివారించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.