మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ

మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ

బతుకమ్మ పండుగలో మూడవ రోజు ‘విదియ’ ‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి, అందంగా అలంకరిస్తారు. మూడోరోజు వాయనంగా ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి గౌరమ్మకి నివేదిస్తారు. ఆపై ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ముద్దపప్పు బతుకమ్మ రోజున కొందరు పుట్నాల పిండి, బియ్యప్పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలతో ‘చలివిడి’ ముద్దలు చేస్తారు. ఇంకొందరు గారెలు చేస్తారు. 

ప్రసాదం తయారీ..

ఒక గిన్నెలో ఒక కప్పు శెనగపప్పు ఉడికించి పెట్టుకోవాలి. తరువాత ఒక కప్పు పాలు గిన్నెలో తీసుకొని మరిగించాలి.  మరుగుతున్న పాలలో ఒక కప్పు బెల్లం, ఉడికించిన పప్పు కలపాలి. మిశ్రమం గట్టి పడేంత వరకు కలిపి దించాలి. అంతే.. ముద్దపప్పు ప్రసాదం రెడీ. ఈ మిశ్రమం అమ్మవారి ప్రసాదంగానే కాకుండా ఆరోగ్యంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పాల వల్ల శరీరానికి ప్రొటీన్స్ అందుతాయి. బెల్లం శరీరానికి ఐరన్‌ ఇస్తుంది.