ఫస్ట్ ​ఫేజ్​ మూడు వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్​

ఫస్ట్ ​ఫేజ్​ మూడు వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్​
  • 8 గంటల్లో 2.70 లక్షల మంది హెల్త్ స్టాఫ్ కు టీకాలు
  • ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ కేంద్రానికి రావాల్సిందే !

హైదరాబాద్, వెలుగు: మొదటిదశ కరోనా వ్యాక్సినేషన్​ కోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మూడు వేల సెంటర్లను సిద్ధం చేస్తోంది. కేంద్రం పర్మిషన్ ఇచ్చిన మరునాడే రాష్ట్రంలోని ప్రభుత్వ, పైవేటు హాస్పిటళ్లలో పని చేస్తున్న 2.70 లక్షల మంది మెడికల్​స్టాఫ్​కు వ్యాక్సిన్​ వేస్తారు. మొత్తం 6,246 మందికి కేవలం 8 గంటల్లోనే టీకా ఇస్తారు. కోవిన్‌‌‌‌ సాఫ్ట్​ వేర్‌‌‌‌ సాయంతో లబ్ధిదారుల ఎంపిక, టీకాల స్టోరేజీ, వ్యాక్సినేషన్​ సెంటర్ల ఏర్పాటు, టీకా వేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర, జిల్లాస్థాయి మెడికల్ ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చారు. వీరిలో అన్ని జిల్లాల్లోని డీఎంహెచ్‌‌‌‌వోలు, కిందిస్థాయి ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే ట్రైనింగ్​ తీసుకున్న జిల్లాస్థాయి సిబ్బంది త్వరలో 10 వేల మంది వ్యాక్సినేటర్స్‌‌‌‌ కు, వారికి సహయంగా ఉండే మరో 25 వేల మంది ఆశావర్కర్లకు, ఏఎన్‌‌‌‌ఎంలకు, 15 వేల మంది డాక్టర్లకు ట్రైనింగ్ ఇస్తారు. జిల్లాల్లో ట్రైనింగ్స్ ​ప్రోగ్సామ్స్​ను వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ కోఠీలోని హెల్త్​ డైరెక్టర్​ఆఫీసులో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ ద్వారా మంగళవారం పరిశీలించారు. అన్ని రకాల ట్రైనింగ్స్​ను డిసెంబరు 22లోగా పూర్తి చేయాలని ఆయన  పబ్లిక్​ హెల్త్ డైరెక్టర్​ డాక్టర్‌‌‌‌ శ్రీనివాసరావును ఆదేశించారు.

ఎవరైనా సెంటర్​కు రావాల్సిందే..

ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే హెల్త్‌‌‌‌ కేర్‌‌‌‌ సిబ్బందికి కూడా ప్రభుత్వ వైద్య సిబ్బందే దగ్గరుండి టీకా వేయనున్నారు. అవసరమైతే వారి వారి హాస్పిటళ్లల్లోనే వీటిని ఇస్తారని ఆఫీసర్లు చెబుతున్నారు. తామే టీకా వేసుకుంటామని ప్రైవేట్ హెల్త్‌‌‌‌ కేర్‌‌‌‌ సిబ్బంది కోరినా ఇవ్వబోమని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. టీకా వేయించుకునేవాళ్లు ఎవరైనా సర్కార్​ ఏర్పాటు చేసిన కేంద్రాలకు రావాల్సిందేనని వెల్లడించింది. వ్యాక్సిన్‌‌‌‌ కోసం టీకా సెంటర్లకు రాలేని వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వయోవృద్ధులు, మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులను టీకా కేంద్రాలకు తీసుకొచ్చే బాధ్యతను ఇతర ప్రభుత్వ శాఖలకు అప్పగించనున్నారు. బడులను, కమ్యూనిటీ కేంద్రాలను, పంచాయతీ ఆఫీసులను వ్యాక్సినేషన్ సెంటర్లుగా ఉపయోగించుకుంటారు.