
- రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ప్రియుడు
- రాజస్తాన్‌లోని బార్మేర్‌లో ఘటన
- ఫేస్బుక్ పరిచయంతో ప్రేమ
జైపూర్: రాజస్తాన్‌కు చెందిన ఓ మహిళ తన ప్రియుడిని పెండ్లికి ఒప్పించేందుకు 600 కి.మీ. కారులో ప్రయాణించింది. అయితే, పెండ్లికి ఒప్పుకోని ఆ ప్రేమికుడు ఆమెను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. రాజస్తాన్‌లోని బార్మేర్‌లో ఈ ఘటన జరిగింది. రాజస్తాన్‌లోని ఝున్‌ఝున్‌లో ముకేశ్ కుమారి అంగన్ వాడీ సూపర్ వైజర్‌గా పనిచేస్తుంది. పదేండ్ల క్రితం తన భర్తతో విడిపోయిన ముకేశ్‌కు గతేడాది అక్టోబర్‌లో బార్మేర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసే మనారామ్‌తో ఫేస్ బుక్‌లో పరిచయమైంది.
ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ముకేశ్ తరచుగా మనారామ్ ను కలుసుకోవడానికి ఝున్‌ఝున్ నుంచి బార్మేర్‌కు దాదాపు 600కి.మీ ప్రయాణించేది.
పెళ్లి వాయిదా వేస్తుండటంతో తరచూ గొడవలు
ముకేశ్ అప్పటికే తన భర్తకు విడాకులు ఇవ్వడంతో మనారామ్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే, మనారామ్ విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉండటంతో అతడు పెళ్లిని వాయిదా వేస్తున్నాడు. దీంతో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ముకేశ్ తన ఆల్టో కారులో ఝున్ ఝున్ నుంచి బార్మేర్ లోని మనారామ్ ఇంటికి వెళ్లింది.
అతడి కుటుంబ సభ్యులకు తాము ప్రేమించుకుంటున్నామని చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండటంతో స్పాట్ కు చేరుకున్న స్థానిక పోలీసులు సమస్యను పరిష్కరించారు. అనంతరం మనారామ్ దీని గురించి తర్వాత మాట్లడుకుందామని ముకేశ్‌కు తెలిపాడు. అదే రోజు సాయంత్రం ఇద్దరు కలిసి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లినప్పుడు ముకేశ్ తలపై ఇనుప రాడ్‌తో కొట్టి ఆమెను హత్య చేశాడు. ముకేశ్ మృతదేహాన్ని ఆమె కారు డ్రైవింగ్ సీటులో ఉంచి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
అనంతరం తన గదికి తిరిగి వచ్చి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ముకేశ్ డెడ్ బాడీ గురించి పోలీసులకు తెలియజేయాలని మనారామ్ తన న్యాయవాదికి చెప్పాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించగా ముకేశ్ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇద్దరి ఫోన్ లొకేషన్లు ఒకే చోట ఉన్నాయని తేలింది. దీంతో మనారామ్‌ను గట్టిగా విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ముకేశ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.