రాష్ట్రంలో టీకా ట్రబుల్​.. 42 లక్షల మంది ఎదురుచూపులు

V6 Velugu Posted on May 05, 2021

  • గడువు దాటిపోతోందని ప్రజల ఆందోళన
  • రిజిస్ట్రేషన్​ తప్పనిసరి.. 
  • ఆన్​లైన్​లో దొరకని స్లాట్లు
  • వ్యాక్సిన్​ ఎక్కడ దొరుకుతదో తెలియని పరిస్థితి

హైదరాబాద్​, వెలుగు: కరోనా వ్యాక్సిన్​ సెకండ్​ డోస్ ఎట్లా అని రాష్ట్రంలో 42 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. రెండో డోస్​ వేసుకునే టైమ్​ ముంచుకువస్తున్నా.. ఎక్కడ, ఎప్పుడు వేయించుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వద్ద పక్కా ప్రణాళిక లేకపోవటం, సరిపడా డోస్​లు లేకపోవటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకో తీరు ప్రకటనతో ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా వ్యాక్సిన్​ బంద్​ చేసింది. 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వయసు వారికి ఎప్పట్నుంచి వ్యాక్సిన్​ వేస్తారో ఇప్పటికీ ప్రకటించలేదు. కొవిడ్​ వారియర్లతో పాటు 45 ఏండ్లుపైబడిన వారికి ప్రభుత్వం తొలుత వ్యాక్సిన్​ వేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 48.69 లక్షల మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇందులో 42.18 లక్షల మంది ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోసు ఒకటే వేసుకోగా, 6.51 లక్షల మంది రెండో డోసు  వేసుకున్నారు. మొదట్లో ప్రైవేట్  హాస్పిటళ్లలో వ్యాక్సిన్​ వేసుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం ఇప్పుడు అక్కడి నుంచి వ్యాక్సిన్​ను స్వాధీనం చేసుకుంది. దీంతో ప్రైవేటు హాస్పిటళ్లలో ఫస్ట్ డోస్​ వేసుకున్న జనం రెండో డోస్​ ఎక్కడ వేసుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. 
రిజిస్ట్రేషన్​ కోసం మీ సేవా సెంటర్ల వద్ద క్యూ
రెండో డోస్​కు కూడా కొవిన్​ పోర్టల్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం తప్పనిసరని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిజిస్ట్రేషన్​ కోసం నిరక్షరాస్యులు, నిరుపేదలందరూ మీసేవా సెంటర్లు, ఇంటర్​నెట్​ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. కరోనా టైమ్ లో టెస్టులతో పాటు వ్యాక్సిన్లకు క్యూలు కట్టిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మీసేవా సెంటర్ల వద్ద కూడా క్యూ కట్టిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ డోస్​ తరహాలోనే సెంటర్ల వద్దే ప్రభుత్వం రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని, అన్ని  హాస్పిటళ్లతో పాటు  పీహెచ్​సీలు, అర్బన్​ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని జనం కోరుతున్నారు. 
గడువు దాటితే.. నో యూజ్​!
ఫస్ట్ డోస్​ వేసుకున్న వారందరూ 30 రోజుల తర్వాత 60 రోజుల లోపు సెకండ్ డోస్​ వేసుకోవటం తప్పనిసరి. కొవాగ్జిన్​ టీకా వేసుకున్నవాళ్లు తప్పనిసరిగా నాలుగు వారాలయ్యాక ఆరు వారాల లోపు సెకండ్​ డోస్​ వేసుకోవాలి. కొవిషీల్డ్ వ్యాక్సిన్​ వేసుకున్న వారు.. 6 వారాల తర్వాత 8 వారాల గడువులోపు సెకండ్​ డోస్​ వేసుకోవాలి.  ఆలస్యమైతే ఫస్ట్ డోస్​ వేసుకున్న ప్రయోజనం కూడా ఉండదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘ఫస్ట్ డోస్ తీసుకున్నాక ఇన్​టైంలో సెకండ్ డోస్​ వేసుకోవాలి. అప్పుడు వైరస్​ను తట్టుకునే యాంటీబాడీస్​ అనుకున్న రేంజ్​లో ఉత్పత్తవుతాయి. సెకండ్ డోస్​ లేటయితే దుష్పరిణామాలు ఏమీ ఉండకపోవచ్చు. కానీ, యాంటీబాడీస్ ఉత్పత్తి తగ్గిపోయి, వైరస్ నుంచి రక్షణ పొందే వీలు ఉండకపోవచ్చు. దీని వల్ల వ్యాక్సిన్ వేయించుకున్నా దాని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది’’ అని ప్రముఖ డాక్టర్ విజయేందర్​ వివరించారు. ఈ గడువు ప్రకారం మే 31 వరకు రాష్ట్రంలో 11 లక్షల మంది సెకండ్​ డోస్​ టీకా తీసుకోవాల్సి ఉంది.  వీరందరికీ ప్రయారిటీగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ప్రైవేట్​ డోస్‌‌ల డ్రామా
ఏప్రిల్​ 30న రాష్ట్రంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్​ హాస్పిటళ్లలో ఉన్న వ్యాక్సిన్లన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ వద్ద ఉన్న డోసులన్నీ  వెనక్కి తీసుకున్నారని, రెగ్యులర్​గా వచ్చే పేషెంట్లు ఇప్పుడు సెకండ్​ డోస్​కు ఇబ్బంది పడుతున్నారని కార్పొరేట్​ యాజమాన్యాలు చెబుతున్నాయి. అసలు ఒక్క వ్యాక్సిన్​ కూడా వెనక్కి తీసుకోలేదని మెడికల్ అండ్​ హెల్త్ డిపార్టుమెంట్​ ఆఫీసర్లు అంటున్నారు. ఏప్రిల్​ 30 వరకు రూ. 250 రేటుకు వ్యాక్సిన్​ అందుబాటులో ఉంది. ఇప్పుడు రేట్లు పెరిగాయి.  ప్రైవేటులో వ్యాక్సిన్​ నిల్వలుంటే ఎక్కువ ధరకు అమ్ముకొని  వ్యాపారం చేసుకునే ప్రమాదముందని హెల్త్ డిపార్ట్​మెంట్​ వర్గాలు చెబుతున్నాయి. 

18‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-44 ఏజ్​ వాళ్లకెప్పుడు..!
రాష్ట్రంలో 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసు వాళ్ల కోసం 4.4 లక్షల డోసులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ, ఈ ఏజ్ గ్రూప్ వాళ్లకు వ్యాక్సిన్ వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ముందుకు రాలేదు.  ప్రస్తుతం రాష్ట్రంలో 4 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో చాలా కొద్ది మొత్తమే కొవాగ్జిన్​ ఉంది. ఎక్కువ డోసులు కొవిషీల్డ్​వే ఉన్నాయి.

వెబ్​సైట్​లో స్లాట్లకు తిప్పలు
వ్యాక్సినేషన్​కు రిజిస్ట్రేషన్   తప్పనిసరి చేయడం జనానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికీ కొవిన్​ రిజిస్ట్రేషన్ సైట్‌‌లో సరైన సమాచారం అందుబాటులో లేదు. సైట్‌‌లో కొన్ని సెంటర్ల వివరాలే ఉన్నాయి. అన్ని సెంటర్లు, అన్ని ఏరియాల్లో వ్యాక్సిన్​ అందుబాటులో ఉంచాల్సిన హెల్త్ డిపార్ట్​మెంట్​ కొన్ని సెంటర్లలోనే అందుబాటులో ఉంచుతోంది. దీంతో ప్రజలు తమకు స్లాట్​ ఎప్పుడు దొరుకుతుంది.. ఏ ఏరియాలో బుక్​ చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొన్ని సెంటర్లలో ఒక్క రోజు స్లాట్లు చూపిస్తే, ఇంకో రోజు నాట్ అప్లికేబుల్‌‌ అని చూపిస్తోంది. ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​తో పల్లెల్లోని ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. 

Tagged vaccine supply, , vaccine stock, telangana vaccination, ts vaccine registration, vaccine centres telangana

Latest Videos

Subscribe Now

More News