కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్​ రేసులో ఎంపీ వద్దిరాజు

కొత్తగూడెం బీఆర్ఎస్  టికెట్​ రేసులో  ఎంపీ వద్దిరాజు
  • పొంగులేటికి దీటైన క్యాండిడేట్​గా భావిస్తున్న హైకమాండ్
  • 200 కార్లతో నియోజకవర్గంలో వద్ది రాజు భారీ ర్యాలీ
  • కేసీఆర్ ​సూచనమేరకే  బలప్రదర్శన చేశారని పార్టీలో చర్చ

భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ రూరల్, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్​ క్యాండిడేట్​గా సిట్టింగ్​ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేరును సీఎం కేసీఆర్ ఇప్పటికే​ ప్రకటించారు. కానీ, బీ ఫారం ఇచ్చే నాటికి కొన్ని సర్దుబాట్లు ఉంటాయని హైకమాండ్​ లీకులు ఇస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే టికెట్​రేసులో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్​ హైకమాండ్​ వద్దిరాజును కొత్తగూడెం ఇన్​చార్జిగా ప్రకటించడంతో సోమవారం ఆయన ఏకంగా 200 కార్లతో భారీ ర్యాలీ తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్​ తరఫున మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. అతన్ని దీటుగా ఎదుర్కొనేందుకే రవిచంద్రను స్వయంగా కేసీఆరే​రంగంలోకి దింపారని, అందుకే ఈ స్థాయిలో బలప్రదర్శనకు దిగారని బీఆర్ఎస్​ వర్గాల్లో టాక్​ నడుస్తోంది. ఇదే జరిగితే.. వనమాకు షాక్​తప్పదని బీఆర్​ఎస్​లో చర్చ జరుగుతున్నది.

ఓసీలను మట్టి కరిపిస్తం :  రవిచంద్ర 

కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్​, కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల్లో సోమవారం రవిచంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్​నాయకులు భారీ కార్​ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాల్వంచ మండలంలోని పెద్దమ్మ టెంపుల్​దగ్గర్లో ఏర్పాటు చేసిన సభలో రవిచంద్ర హాట్​కామెంట్స్​చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేసే ఓసీలను మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. కొంతమంది స్థానికేతరులైన ఓసీలు ఇక్కడ పోటీ చేసేందుకు వస్తున్నారని, అటువంటి వారిని చిత్తుగా ఓడిస్తామని పరోక్షంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిని విమర్శించారు. ‘ఇక్కడ మీ కార్యకర్తలు ఎవరూ లేరు. మీరు డబ్బు సంచులు పట్టుకొని వస్తే ఇక్కడ తిప్పి కొడ్తారు..’ అంటూ ఫైర్​ అయ్యారు. తానే కాదని, తన వెనక సీఎం కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఇంకా చాలా మంది ప్రతినిధులు ఇక్కడకు వస్తారన్నారు. తాను వనమా గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.