వగెర, శ్రీ, తొలగించాలి, పడవ.. పదాలు కావివి.. పట్టాదారులు ..భూ భారతి వచ్చినా మారని పేర్లు

వగెర, శ్రీ, తొలగించాలి, పడవ.. పదాలు కావివి.. పట్టాదారులు ..భూ భారతి వచ్చినా మారని పేర్లు
  • వగెర పేరిట కరీంనగర్ జిల్లా గర్శకుర్తిలో 107 ఎకరాల భూమి
  • తొలగించాలి పేరుతో జనగామ జిల్లా కడవెండిలో 195.19 ఎకరాలు ఎంట్రీ 
  • భూరికార్డుల ప్రక్షాళన టైంలో ఎవరూ క్లెయిం చేసుకోని భూముల పట్టాదారులకు అధికారుల పేర్లు
  • ఫీల్డ్​ ఎంక్వైరీ చేసి పేర్లు మార్చడంలో అధికారుల నిర్లక్ష్యం
  • భూభారతి వచ్చినా మారని పేర్లు

కరీంనగర్, వెలుగు: వగెర, శ్రీ, తొలగించాలి, పడవ, పేరు తెలియదు, మిగులు భూమి, ఇతరులు, ఊర్లో లేరు, 999, చారయీ ఇవన్నీ కేవలం పదాలు మాత్రమే కాదు.. రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో పట్టాదారుల పేర్లు. ఇలాంటి ఇంకా ఎన్నో పేర్ల మీద ఒక్కో గ్రామంలో 50 నుంచి 200 ఎకరాల మేర వ్యవసాయ భూములు నమోదై ఉన్నాయి. ఈ భూముల్లో ప్రభుత్వ భూములతో పాటు పట్టా భూములు కూడా ఉన్నాయి. గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లకు సంబంధించిన భూములకు ఓనర్  ఎవరో తెలియకపోయినా, వారసుల విషయంలో సందేహాలు ఉన్నా ఆ భూములకు పట్టాదారు పేరు ఇలా ఎవరికి తోచినట్లు వారు పెట్టేశారు. 

అంతేగాక రెవెన్యూ అధికారులు ఆ భూములకు ఖాతా నంబర్  కూడా ఇచ్చారు. కరీంనగర్  జిల్లాలో పట్టాదారు పేరు వగెరా, ఇతరులు అని, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో పట్టాదారు పేరు మిగులు భూమి అని, మహబూబాబాద్  జిల్లాలో శ్రీ అని, జనగామ జిల్లాలో తొలగించాలి అని, మరికొన్ని జిల్లాల్లో అన్ నోన్  పర్సన్  అని, 999గా ఎంట్రీ చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాలకుపైగా ఉన్నట్లు అంచనా. ఇందులో పట్టా భూములను తమ పేర్ల మీదికి మార్చాలని,అసలైన ఓనర్లు సరైన ఆధారాలతో  రెవెన్యూ ఆఫీసర్లకు దరఖాస్తులు ఇచ్చినా మార్చడం లేదనే విమర్శలున్నాయి.

ధరణిలో  దొర్లిన తప్పులే భూభారతిలోనూ.. 

బీఆర్ఎస్  సర్కార్  హయాంలో 2017లో ల్యాండ్  రికార్డ్స్  అప్ డేషన్  ప్రోగ్రామ్(ఎల్ఆర్ యూపీ) చేపట్టింది. ఎన్నికల ముందు రైతుబంధు వేయాలనే ఉద్దేశంతో రైతుల భూముల వివరాలను త్వరగా డిజిటలైజ్  చేయాలని అప్పటి ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందికి టార్గెట్స్  విధించడంతో అనేక తప్పులు దొర్లాయి. ఇవే లోపాలు ఇప్పటికీ  రైతులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ధరణి పోర్టల్ ను మార్చేసి, భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ లోని భూముల డేటాను ఉన్నది ఉన్నట్లుగా భూభారతి పోర్టల్ లోకి అప్ లోడ్  చేశారు. దీంతో ధరణి పోర్టల్ లోని తప్పులే భూభారతిలోనూ కనిపిస్తున్నాయి.  

4 సార్లు దరఖాస్తు చేస్తే  రిజెక్ట్ చేసిన్రు.. 

మహబూబాబాద్  మండలం పర్వతగిరి గ్రామంలో మా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి పలు సర్వే నంబర్లతో పాటు 144/బీ సర్వే నంబర్ లో ఎకరం 14 గుంటలు ఉండేది. బీఆర్ఎస్  సర్కార్  జారీ చేసిన కొత్త పాస్ బుక్ లో ఎకరం ఎగిరిపోయి 14 గుంటలు మాత్రమే నమోదైంది. అలాగే 144/సీ సర్వే నంబర్ లో నా తండ్రి అవినాశ్ రెడ్డి పేరు మీద పాత పాస్ బుక్ లో అర ఎకరం భూమి ఉండేది. కొత్త పాస్  బుక్​లో ఆ సర్వే నంబర్, అర ఎకరం భూమి మిస్సయింది. మాకు సంబంధించిన భూమి 144/సీ/1/1/1 అనే సర్వే నంబర్ లో శ్రీ పేరిట నమోదైంది. ఈ భూమిని మా పేరిట మార్చాలని మీ సేవలో ఇప్పటి వరకు రూ.4 వేలు చెల్లించి 4 సార్లు అప్లై చేసినా రిజెక్ట్  అయింది. ఎందుకు రిజెక్ట్  చేస్తున్నారని అడిగితే తహసీల్దార్  సమాధానం చెప్పడం లేదు.  

-- యర్రంరెడ్డి సంపత్ రెడ్డి,  పర్వతగిరి, మహబూబాబాద్ -