
ఒక ఆటగాడు 14 ఏళ్ళకే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడడం చాలా అరుదు. ఇక అదే ఏజ్ లో రంజీ ట్రోఫీ ఆడడం అంటే చాలా గొప్పగా భావిస్తారు. కానీ 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ టాలెంట్ అంతకు మించి అనేలా ఉంది. ఐపీఎల్ 2025లో తన బ్యాటింగ్ తో ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసిన 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ క్రేజ్ రోజు రోజుకీ విస్తుపోయేలా చేస్తుంది. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని ఐపీఎల్ లో సంచలనంగా మారాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 సిరీస్ లోనూ వన్డే, టెస్ట్ ఫార్మాట్ లోనూ సత్తా చాటాడు. తాజాగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు బీహార్ వైస్ కెప్టెన్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయడం విశేషం.
2025 ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన సూర్యవంశీ.. తన ఇన్నింగ్స్ గాలివాటమేమీ కాదని నిరూపించాడు. ఐపీఎల్ తర్వాత జరిగిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో సూర్యవంశీ తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ ప్రతిభను మెచ్చిన బీహార్ క్రికెట్ ఈ 14 ఏళ్ళ కుర్రాడికి బీహార్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్న ఈ దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీకి 15 మందితో కూడిన బీహార్ జట్టును ప్రకటించారు. సకీబుల్ గని కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. బీహార్ అక్టోబర్ 15న తన తొలి మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 25న మణిపూర్‌తో ఆడాల్సి ఉంది.
ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ తో ముగిసిన అండర్-19 టోర్నీలో ఒక భారీ సెంచరీతో సహా ఐదు మ్యాచ్ ల్లో 355 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా వైభవ్ దూకుడు ముందు బౌలర్లు కుదేలైపోతున్నారు. చివరిసారిగా ఆడిన యూత్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 20, 0 పరుగులు చేసి విఫలమైనప్పటికీ.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో 113 పరుగులు చేశాడు. ప్రతి లీగ్ లో ఆకట్టుకుంటున్న సూర్యవంశీ రంజీ ట్రోఫీలో ఎలా ఆడతాడో ఆసక్తికరంగా మారింది.
బీహార్ రంజీ ట్రోఫీ 2025/26 జట్టు
పీయూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సకీబుల్ గని (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అర్నవ్ కిషోర్, ఆయుష్ లోహరుక, బిపిన్ సౌరభ్, అమోద్ యాదవ్, నవాజ్ ఖాన్, సాకిబ్ హుస్సేన్, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు కుమార్, ఖలిద్.