టెంపర్డ్ గ్లాస్‌‌ల తయారీ ప్లాంట్ ప్రారంభించిన వైష్ణవ్‌‌

టెంపర్డ్ గ్లాస్‌‌ల తయారీ ప్లాంట్ ప్రారంభించిన వైష్ణవ్‌‌

నోయిడా: టెంపర్డ్‌‌ గ్లాస్‌‌లు తయారు చేసే ప్లాంట్‌‌ను  కేంద్ర ఎలక్ట్రానిక్స్,  ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఆప్టిమస్ ఇన్‌‌ఫ్రాకామ్‌‌ నోయిడాలో  రూ.870 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని డెవలప్ చేస్తోంది. ఇండియాలో తయారైన టెంపర్డ్ గ్లాస్‌‌ స్క్రీన్‌‌ను  రైనో టెక్ అనే  బ్రాండ్‌‌తో అమ్ముతుంది. ఇందులో యూఎస్‌‌ బేస్డ్  కార్నింగ్‌‌ గ్లాస్‌‌ను ఉపయోగించారు. మొదటి దశలో రూ.70 కోట్లతో ఏడాదికి 2.5 కోట్ల యూనిట్ల సామర్థ్యంతో ఫ్యాక్టరీని నిర్మించారు. 600 మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చామని కంపెనీ చెబుతోంది.  “ఆప్టిమస్  ఈ ఏడాది చివరికి కార్నింగ్‌‌ గ్లాస్‌‌తో స్క్రీన్ ప్రొటెక్షన్ల  ఉత్పత్తి ప్రారంభిస్తుంది” అని వైష్ణవ్‌‌ తెలిపారు. 

కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ (ఆర్‌‌‌‌ అండ్ డీ) బృందాన్ని 40 నుంచి 400కి పెంచాలని సూచించారు. ఈ కంపెనీ చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా మాట్లాడుతూ,  రెండో దశలో రూ.800 కోట్ల అదనపు పెట్టుబడి పెడతామని, తయారీ సామర్థ్యాన్ని 20 కోట్ల యూనిట్లకు పెంచుతామని,  4,500 మందికి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.  భారత్‌‌లో కార్నింగ్  గ్లాస్ ఆధారంగా స్క్రీన్ ప్రొటెక్షన్లను తయారు చేసే మొదటి కంపెనీ తమదేనని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ తయారైన టెంపర్డ్ గ్లాస్‌‌లను ఎగుమతి కూడా చేస్తామని చెప్పారు.