
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమా వస్తుందంటే తమిళంలోనే కాదు తెలుగులోనూ ఆ సినిమాపై అంచనాలు ఉంటాయి. అలాంటి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే వస్తుంది ‘వలీమై’. హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ ‘ముందుగా ఈ చిత్రాన్ని తమిళంలో మాత్రమే విడుదల చేద్దామనుకున్నాం. అయితే తెలుగునాట సంక్రాంతి సీజన్‌కి ఉన్న ఇంపార్టెన్స్ గుర్తించి ఇదే సరైన సమయమని తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఒకే సారి రిలీజ్ చేస్తున్నాం. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్నట్టే గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆకట్టుకుంటుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, చేజింగ్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. ఇందులో అజిత్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తాడు’ అని చెప్పారు. తెలుగులోనూ ఇదే టైటిల్‌ని ఫైనల్ చేశారు. విజయ్ దేవరకొండ, నాగచైతన్యలు ఈ మూవీ తెలుగు పోస్టర్స్‌ని ట్వీట్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పారు. తెలుగు హీరో కార్తికేయ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హుమా ఖురేషి హీరోయిన్. గుర్బాని జడ్జి, సుమిత్ర, యోగిబాబు, సెల్వ ఇతర పాత్రలు పోషించారు.