విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి : సంచిత్ గంగ్వార్

 విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి : సంచిత్ గంగ్వార్

వనపర్తి, వెలుగు:  పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే  భయపడాల్సిన అవసరం లేదని , చదివిన  విషయాలను   ఆత్మవిశ్వాసంతో  రాయాలని వనపర్తి     అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు.   గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్టళ్లకు చెందిన  పదో తరగతి ఎస్సీ, ఎస్టీ, బీ.సి. విద్యార్థులకు   ప్రేరణ, పునఃశ్చరణ తరగతులు నిర్వహించారు.  

ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై  అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు.  విద్యార్థులు పరీక్షలంటే భయపడొద్దని,  మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు.    ఇష్టంతో చదివితే  ఏ పరీక్షలో అయినా మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు.  విద్యార్థులందరూ బోర్డు పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నుషిత, డీటీడీఓ ఎం శ్రీనివాసులు, ఇంపాక్ట్ రవీంద్ర ధీర, ఉపాధ్యాయ నిపుణులు శ్రీనివాసులు,  నాగరాజు, గోవర్ధన్, మధుసూదన్, శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

చిన్నచింతకుంట, వెలుగు: త్వరలో జరగనున్న టెన్త్ పరీక్షలపై విద్యార్ధులు టెన్షన్ పడొద్దని డీఈఓ రవీందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్ , లాల్ కోట, వడ్డేమాన్ జడ్పీహెచ్ఎస్ స్కూళ్లను  ఆయన ఆకస్మికంగా తనిఖీ  చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో  మాట్లాడారు.  ధైర్యంగా ఉండి పరీక్షలు రాయాలన్నారు. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. డీఈ ఓ వెంట ఎఎంఓ శ్రీనివాస్ , సీఎంఓ బాలు యాదవ్ ఉన్నారు.