టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. పీవీ కూతురు వాణిదేవి

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. పీవీ కూతురు వాణిదేవి
  • రేపు నామినేషన్ వేయనున్న సురభి వాణిదేవి

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది.  మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు కూతురు వాణిదేవిని ఖరారు చేసింది. వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. పీవీ నరసింహారావు వారసులంతా చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పీ వీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ అనూహ్యంగా పీవీ వారసుల గురించి తెరపైకి తేవడమే కాదు.. తగినవిధంగా గౌరవిస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీని ఇరకాటం పెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో కొందరు  పీవీ కూతురు సురభి వాణిదేవిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తారని ప్రచారం చేశారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక రావడం.. ఆ వెంటనే జీహెచెఎంసీ ఎన్నికలు జరగడంతో కేసీఆర్ సైలెంట్ అయినట్లు కనిపించారు. ఈ రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చావు దెబ్బతినడంతో ఆ పార్టీ తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన వారంతా సైలెంట్ అయ్యారు. దీంతో సీఎం కేసీఆర్ అనూహ్యంగా పీవీ నరసింహారావు కుమార్తెను వెంటనే తెరపైకి తెచ్చారు. మాదాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలైన సురభి వాణిదేవి విద్యా రంగంలోనే కొనసాగుతుండడంతో పట్టభద్ర ఎమ్మెల్సీకి ఆమెనే సరైన అభ్యర్థి అవుతుందని కేసీఆర్ అంచనా వేసినట్లు తెలుస్తోంది. పీవీ నరసింహారావు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడంతో తానే గుర్తింపు కల్పించాలని నిర్ణయించినట్లు ప్రకటించుకున్న కేసీఆర్.. పీవీ వారసులకు పెద్దపీట వేయడం ద్వారా కాంగ్రెస్ తోపాటు.. బీజేపీని కూడా దెబ్బతీయొచ్చని.. భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేడి చల్లారక ముందే తాజాగా పట్టభద్ర ఎన్నికల సమరం మొదలు కావడంతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. అనూహ్య మలుపులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూద్దాం.

 

For More News..

కార్పొరేట్  కాలేజీలు మూసేసేదాకా పోరాడదాం

కేసీఆర్ కోటనే కొట్టా.. ఆ కాలేజీలు ఓ లెక్కా?

తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాతృభాషపై ప్రేమ లేదు

శ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు