బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. రిలయన్స్‌కు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటకం రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8 – 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు దేశ-విదేశాల నుంచి భారీ స్పందన లభిస్తోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎం ఓయూ కుదుర్చుకోనున్నారు.
అలాగే, రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్‌కు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ.. నైట్ సఫారీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు మారనున్నాయి. ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ కంపెనీ రూ.3 వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనున్నారు.
