స్వీట్ పొటాటోలతో వెరైటీలు

స్వీట్ పొటాటోలతో వెరైటీలు

చిలగడ దుంప, మొరం గడ్డ, గెనుసు గడ్డ .. ఇలా రకరకాల పేర్లు స్వీట్​ పొటాటోకి. మామూలుగా అయితే దీన్ని ఉడకబెట్టి, కాల్చి, పులుసు చేసుకుని తింటారు. ఇలానే కాకుండా ఇంకా బోలెడు వెరైటీలు చేసుకోవచ్చు ఈ స్వీట్ పొటాటోతో. పిల్లలు ఇష్టంగా తినే డోనట్స్‌‌, ఈవెనింగ్ శ్నాక్​ టాట్స్‌‌తో పాటు క్రేజీగా స్వీట్​ పొటాటోతో స్పైసీ కర్రీ కూడా చేసుకోవచ్చు. పైగా వీటిని చేయడం అంత కష్టమేం కాదు. ఈజీగా వండేయొచ్చు. ఇంకెందుకాలస్యం... స్వీట్ పొటాటోలతో వెరైటీలు చేయడానికి రెడీ అయిపోండి.

స్పైసీ కర్రీ 

కావాల్సినవి :

గెనుసు గడ్డలు – అర కిలో, నీళ్లు – రెండు కప్పులు
పసుపు – పావు టీస్పూన్, ఉప్పు – ఒక టీస్పూన్
ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు – ఒక్కో టీస్పూన్ చొప్పున
శనగపప్పు – ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఎండు మిర్చి – మూడు, నూనె – సరిపడా
కరివేపాకు –  కొద్దిగా

తయారీ : 

ఒక పాత్రలో నీళ్లు పోసి, గెనుసు గడ్డల ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత వడకట్టాలి. ఒక పాన్​లో ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి. వాటన్నింటినీ మిక్సీజార్​లో వేసి గ్రైండ్ చేయాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగించాలి. ఆ తర్వాత ఉడికించిన గెనుసు గడ్డ ముక్కలు వేసి కలపాలి. కాసేపు వేగాక, ఉప్పు, ముందుగా రెడీ చేసుకున్న పొడి వేసి కలపాలి. రెండు నిమిషాలు వేగిస్తే స్వీట్​ పొటాటోలతో స్పైసీ కర్రీ రెడీ.   

స్వీట్ పొటాటో టాట్స్

కావాల్సినవి :

గెనుసు గడ్డలు – రెండు, మొక్కజొన్న పిండి – రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు, మిరియాల పొడి – ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున, నూనె, నీళ్లు – సరిపడా

తయారీ :

కుక్కర్​లో నీళ్లు పోసి గెనుసు గడ్డలు ముక్కల్ని ఉడికించాలి. తర్వాత నీటిని వడకట్టాలి. ఒక గిన్నెలో ఉడికించిన గెనుసు గడ్డలు, మొక్కజొన్న పిండి, ఉప్పు, మిరియాల పొడి వేసి ముద్దగా కలపాలి. ఆ పిండిని చిన్న చిన్న క్యూబ్స్​లా తయారుచేసుకోవాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి, అందులో క్యూబ్స్ వేసి బ్రౌన్​ కలర్ వచ్చేంత వరకు వేగించాలి. వీటిని టొమాటో కెచెప్​తో తింటే బాగుంటాయి. 

డోనట్స్

కావాల్సినవి :

గెనుసు గడ్డలు – అర కిలో
చక్కెర – అర కప్పు, మైదా – ఒక కప్పు
పాల పొడి – అర కప్పు, కోడిగుడ్లు – రెండు, బ్రెడ్ పొడి – ఒక కప్పు
నూనె, నీళ్లు – సరిపడా

తయారీ : 

గెనుసు గడ్డలను తొక్క తీసి, ముక్కలుగా కోయాలి. కుక్కర్​లో నీళ్లు పోసి, ఈ ముక్కల్ని అందులో వేసి మూత పెట్టి ఉడికించాలి. గెనుసు గడ్డలు ఉడికాక, నీళ్లు ఒంపేసి, ముక్కల్ని ఒక గిన్నెలో వేయాలి. ఉడికిన ముక్కల్ని చేత్తో పొడి పొడి చేయాలి. చక్కెర, పాల పొడి, మైదా వేసి టెక్స్చర్​ మెత్తగా అయ్యేంత వరకు కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుని డోనట్స్​లా చేయాలి. తర్వాత డోనట్స్​ని కోడిగుడ్డు సొనలో ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి. కాగిన నూనెలో రెండు వైపులా కాల్చితే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో డోనట్స్ రెడీ.