కిచెన్ తెలంగాణ.. ఎంజాయ్ కాఫీ డే!

కిచెన్ తెలంగాణ.. ఎంజాయ్ కాఫీ డే!

పొద్దున లేవగానే చేసే మొదటి పని ఏంటంటే... కాఫీ తాగడం అంటారు కొందరు. కాఫీ తాగనిదే రోజు గడవదు అంటారు మరికొందరు. కాఫీ వాసన చూసినా మైమరిచిపోతారు ఇంకొందరు. కాఫీని అంతగా ఇష్టపడే కాఫీ లవర్స్ అందరికీ ఈ వెరైటీ కాఫీ రెసిపీలు అంకితం. ఈ రోజు ‘వరల్డ్​ కాఫీ డే’ సందర్భంగా రకరకాల కాఫీలు టేస్ట్​ చేసేయండి.

పింక్ మెలంగ్ కాఫీ

కావాల్సినవి :

పాలు - 400 మిల్లీ లీటర్లు, బీట్ రూట్ - 200 గ్రాములు

వెనిలా ఎసెన్స్ - రెండు టీస్పూన్లు, 

కాఫీ పొడి - ఒకటిన్నర టీస్పూన్, తేనె - సరిపడా

తయారీ : ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడి వేసి, కొన్ని వేడి నీళ్లు పోసి కలపాలి. మరో గిన్నెలో పాలు పోసి, వెనిలా ఎసెన్స్, బీట్ రూట్ తరుగు వేసి కలపాలి. ఇరవై నిమిషాలు ఆ మిశ్రమాన్ని ఉడికించాక వడకట్టాలి. ఆ మిశ్రమాన్ని నాలుగు నిమిషాల పాటు ఎలక్ట్రిక్ మిక్సర్​తో బీట్ చేయాలి. ఒక గ్లాస్​లో తేనె వేసి, అందులో బీట్​రూట్​ పాలు పోయాలి. ఆ తర్వాత పాల నురుగు వేయాలి. చివరిగా రెడీ చేసిన కాఫీని నెమ్మదిగా పోయాలి. 

 

 బోబా కాఫీ

కావాల్సినవి :

కాఫీ పొడి - ఒక టీస్పూన్
 

సగ్గుబియ్యం - ముప్పావు కప్పు

నీళ్లు - ఐదు కప్పులు

చక్కెర లేదా తేనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్

ఐస్ క్యూబ్స్ - కొన్ని

పాలు - పావు కప్పు

తయారీ : ఒక గిన్నెలో కాఫీ పొడి వేసి, నీళ్లు పోసి గిలక్కొట్టి డికాషన్ చేయాలి. మరొక గిన్నెలో నీళ్లు పోసి కాగబెట్టాలి. అవి కాగాక వాటిలో సగ్గుబియ్యం వేసి అవి పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టాలి. వాటిని ఒక గిన్నెలో వేసి అందులో చక్కెర లేదా తేనె వేసి కలపాలి. వాటిలో కొన్నింటిని ఒక గ్లాసులో వేయాలి. ఆ తర్వాత డికాషన్​, పాలు కూడా గ్లాసులో పోయాలి. స్పూన్​తో ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత తాగాలి. 

ఆరెంజ్ ఎస్​ప్రెసో టానిక్

కావాల్సినవి :

ఆరెంజ్ - ఒకటి 

కాఫీ పొడి - రెండు టీస్పూన్లు

ఐస్ క్యూబ్స్ - సరిపడా

సోడా వాటర్ - అర కప్పు

తయారీ : ఆరెంజ్​జ్యూస్ తీయాలి. కాఫీ పొడిలో వేడి నీళ్లు కలిపి ఎస్​ప్రెసో డికాషన్ తయారుచేయాలి. ఒక గ్లాస్​లో ఆరెంజ్ జ్యూస్ పోసి, ఐస్ క్యూబ్స్ వేయాలి. అందులో సోడా వాటర్​ పోయాలి. ఆ తర్వాత కాఫీ ఎస్​ప్రెసో కూడా పోయాలి. ఆరెంజ్​ ముక్క ఒకటి గ్లాస్​లో పెట్టాలి. మూడు నిమిషాల తర్వాత ఐస్డ్​ ఆరెంజ్ కాఫీని తాగితే టేస్ట్ భలే ఉంటుంది. 

మోకా కాఫీ

కావాల్సినవి :

కాఫీ పొడి - ఒక టీస్పూన్ 

చక్కెర - ఒక టీస్పూన్

కొకొవా పౌడర్ - ఒక టేబుల్ స్పూన్

వేడి నీళ్లు - మూడు టేబుల్ స్పూన్లు 

పాలు - ఒక కప్పు

తయారీ : ఒక కప్పులో కాఫీ పొడి, చక్కెర, కొకొవా పౌడర్ వేయాలి. అందులో వేడి నీళ్లు పోసి, బాగా గిలక్కొట్టాలి.  మరోలా చేసుకోవాలంటే ఒక కప్పులో పది గ్రాముల డార్క్ చాకొలెట్​ వేసి వేడి నీళ్లు పోసి కరిగించాలి. ఆ తర్వాత అందులో చక్కెర వేసి కలపాలి.  ఆ తర్వాత ఒక గిన్నెలో పాలు పోసి కాగబెట్టాలి. ఆ పాలను గ్లాస్​ జార్​లో పోసి మూత పెట్టి నురగ వచ్చేంతవరకు బాగా గిలక్కొట్టాలి. తర్వాత డికాషన్ ఉన్న కప్పులో పాలు పోయాలి. అంతే... హాట్ మోకా కాఫీ రెడీ.

డల్గొనా కాఫీ

కావాల్సినవి :

పాలు - ఒక గ్లాస్​

కాఫీ పొడి, చక్కెర వేడి నీళ్లు - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున

తయారీ : పాలు కాగబెట్టాలి. మిక్సీజార్​లో కాఫీ పొడి, చక్కెర వేసి, వేడి నీళ్లు పోసి బ్లెండ్​​ చేయాలి. ఆ మిశ్రమాన్ని కప్పులో పోసి క్రీమ్​లా తయారయ్యే వరకు బాగా గిలక్కొట్టాలి. ఆ తర్వాత ఒక గ్లాస్​లో వేడి పాలు పోసి, పైన క్రీమ్​లా తయారైన కాఫీ మిశ్రమాన్ని వేయాలి. అంతే... హాట్​ హాట్​గా డల్గొనా కాఫీ రెడీ. దీన్నే కోల్డ్​ కాఫీలా తాగాలనుకుంటే... కాచి చల్లార్చిన పాలు పోసి, ఐస్​ ముక్కలు వేసుకోవాలి. చాకొలెట్​ ఫ్లేవర్​ కావాలనుకుంటే ఆ సిరప్​ కూడా వేసుకోవచ్చు. 

బుల్లెట్ ప్రూఫ్​ కాఫీ

కావాల్సినవి :

కాఫీ పొడి - ఒకటిన్నర టీస్పూన్

వేడి నీళ్లు - 200 మిల్లీ లీటర్లు

నెయ్యి లేదా కొబ్బరి నూనె - ఒక టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో కాఫీ పొడి వేసి, వేడి నీళ్లు పోయాలి. మూత పెట్టి రెండు నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత మూత తీసి ఆ డికాషన్​ని మిక్సీజార్​లో పోయాలి. దాంతోపాటు నెయ్యి వేసి బ్లెండ్​ చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని కప్​లో పోసి తాగడమే. కావాలంటే పైన  దాల్చిన చెక్క పొడి చల్లుకోవచ్చు.