తెలంగాణ కిచెన్ : జామ్ .. జామ్​.. జామ

తెలంగాణ కిచెన్ : జామ్ .. జామ్​.. జామ

జామకాయని కట్ చేసి ఉప్పు, కారం వేసుకుని తింటే భలే ఉంటుంది! జామ పండు జ్యూస్​ కూడా తాగే ఉంటారు. కానీ, అదే జామకాయ లేదా పండుతో ఇలా ఎప్పుడైనా వండి చూశారా? లేదా మరయితే వీటిని కచ్చితంగా ట్రై చేయండి. ఊహించినదాని కంటే మించిన టేస్ట్​ ఎంజాయ్ చేస్తారు. మరింకెందుకాలస్యం జామకాయతో వంటలు చేసేందుకు రెడీ అవ్వడమే... 

రోటి పచ్చడి

కావాల్సినవి : 

లేత జామకాయలు- ఆరు

చింతపండు- పావు కప్పు 
 

పచ్చిమిర్చి, ఎండు మిర్చి- ఒక్కోటి పదిహేను చొప్పున
 

ఉప్పు, నూనె- సరిపడా
 

పుదీనా, కొత్తిమీర- కొంచెం
 

ఉల్లిగడ్డ- ఒకటి

తయారీ : నీళ్లలో చింతపండు నానబెట్టాలి. నూనె వేయకుండా ఎండు, పచ్చిమిర్చిలను విడివిడిగా వేగించాలి. తర్వాత నూనె వేడి చేసి అందులో జామకాయ ముక్కలు వేగించి పక్కన పెట్టాలి. అదే పాన్​లో కొత్తిమీర, పుదీనా కూడా వేగించాలి. ఆ తర్వాత రోట్లో ఎండు మిర్చి, ఉప్పు వేసి దంచాలి. పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, పుదీనా, కొత్తిమీర కూడా దంచి, జామకాయ ముక్కల్ని వేసి మెత్తగా దంచాలి. పాన్​లో నూనె వేడి చేసి, పోపు దినుసులు వేయాలి. అవి వేగాక, ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు వేగించాలి. అందులో  జామకాయ పచ్చడి వేసి కలపాలి. 

రైస్

కావాల్సినవి :

జామకాయలు- మూడు

నూనె- మూడు టీస్పూన్లు

అన్నం- రెండు కప్పులు

శనగపప్పు, మినపప్పు, ఆవాలు- అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ 

పల్లీలు- పావు కప్పు

ఉల్లిగడ్డ- ఒకటి 

పసుపు, మిరియాల పొడి- ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున

పచ్చిమిర్చి- రెండు

కరివేపాకు, కొత్తిమీర- కొంచెం

ఉప్పు- సరిపడా

తయారీ : జామకాయల్లో గింజలు రాకుండా తురమాలి. నూనె వేడి చేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేగించాలి. తర్వాత అందులోనే పల్లీలు వేగించాలి. అవి వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసి కాసేపు తిప్పి అందులోనే జామకాయ తురుము వేసి కలపాలి. మూడు నిమిషాలు వేగాక మిరియాల పొడి చల్లాలి. ఆ తర్వాత అన్నం కూడా వేసి కలపాలి. పైన కొత్తిమీర చల్లితే జామకాయ రైస్ రెడీ. 

రింగ్స్

కావాల్సినవి :

జామకాయ- ఒకటి (పెద్దది)

మైదా- రెండు టేబుల్ స్పూన్లు

కార్న్​ ఫ్లోర్- మూడు టేబుల్ స్పూన్లు

కారం- ఒక టీస్పూన్

శనగపిండి- ఒక టేబుల్ స్పూన్

బ్రెడ్ క్రంబ్స్​- ఒక కప్పు

ఉప్పు, నీళ్లు, నూనె- సరిపడా

తయారీ : జామకాయని రింగులుగా కట్​ చేయాలి. వాటి మధ్యలో ఉన్న గుజ్జును స్పూన్​తో తీసేయాలి. ఒక గిన్నెలో మైదా, శనగపిండి, కార్న్​ఫ్లోర్​, కారం వేయాలి. అందులో నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలపాలి. తర్వాత అందులో ఉప్పు వేసి మరోసారి కలపాలి. ఆ తర్వాత జామకాయ రింగులను ఆ మిశ్రమంలో ముంచి, బ్రెడ్​ క్రంబ్స్​లో దొర్లించాలి. వేడి నూనెలో జామకాయ రింగుల్ని వేసి గోల్డెన్ బ్రౌన్​ కలర్ వచ్చేవరకు వేగించాలి.  

మసాలా

కావాల్సినవి:

జామకాయ ముక్కలు- ఒక కప్పు

పచ్చిమిర్చి- రెండు 

నల్ల ఉప్పు- ఒక టీస్పూన్

కారం, ఎండు మిర్చి పొడి,  జీలకర్ర పొడి– అర టీస్పూన్

కసుంది లేదా మస్టర్డ్ సాస్- ఒక టీస్పూన్

కొత్తిమీర - కొంచెం

కసుంది కోసం : పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు- ఒక్కోటి నాలుగేసి చొప్పున

పసుపు, నిమ్మరసం- అర టీస్పూన్

పసుపు, నలుపు ఆవాలు- రెండూ కలిపి ఒక కప్పు

ఉప్పు, నీళ్లు- సరిపడా

తయారీ : మిక్సీజార్​లో పసుపు, నలుపు రంగు ఆవాలు, పసుపు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, నిమ్మరసం, 
నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. కావాలంటే వెల్లుల్లి బదులు అల్లం వేసుకోవచ్చు. కసుంది కావాలంటే సూపర్​ మార్కెట్​ లేదా ఆన్​లైన్​లో దొరుకుతుంది.

మసాలా తయారీ : ఒక గిన్నెలో జామకాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, నల్ల ఉప్పు, కారం, వేగించిన ఎండు మిర్చి పొడి,  జీలకర్ర పొడి, కసుంది, కొత్తిమీర వేసి కలపాలి. అంతే... ఎంతో టేస్టీగా ఉండే జామకాయ మసాలా రెడీ.  

క్రేప్స్

కావాల్సినవి :  

జామపండ్లు- మూడు (చిన్నవి)

మైదా- ఒక కప్పు

చక్కెర- అర కప్పు

దాల్చిన చెక్క పొడి- అర టీస్పూన్

కోడిగుడ్డు- ఒకటి

వెనిలా ఎసెన్స్, చీజ్, చాకొలెట్ సిరప్​- ఒక్కో టీస్పూన్ చొప్పున

నీళ్లు- సరిపడా

తయారీ : జామపండ్లను శుభ్రంగా కడిగి, కట్ చేయాలి. లోపలి గుజ్జు తీసేసి పొడవాటి ముక్కలుగా కట్ చేయాలి. వాటిని మిక్సీజార్​లో వేసి, అందులో చక్కెర వేసి నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాన్​లో పోసి ఉడికించాలి. అందులో దాల్చిన చెక్క పొడి వేయాలి. మిశ్రమం దగ్గర పడ్డాక దాన్ని ఒక గిన్నెలోకి తీయాలి. 
మరో గిన్నెలో మైదా పిండి జల్లెడ పట్టాలి. అందులో కోడిగుడ్డు సొన, వెనిలా ఎసెన్స్, దాల్చిన చెక్క పొడి వేసి, నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని  దోశెలా పోయాలి. రెండో వైపు తిప్పాక దానిపైన చీజ్, తయారుచేసిన జామ్​ని ఒకవైపు పూసి మరో వైపు నుంచి మడతపెట్టాలి. దానిపైన చాకొలెట్ సిరప్​ పూసి మరో మడతవేయాలి. పైనుంచి చక్కెర పొడి చల్లి, జామ జాముతో తింటే టేస్టీగా ఉంటుంది.

గ్వావా చీజ్

కావాల్సినవి :

జామపండ్లు - పద్నాలుగు

చక్కెర - రెండు కప్పులు

చక్కెర పొడి - ఒక కప్పు

నీళ్లు, వెన్న- సరిపడా

తయారీ : జామపండ్ల తొక్క తీసి, ముక్కలుగా తరగాలి. ఆ ముక్కల్ని పాన్​లో వేసి, కొన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత మెత్తగా మెదిపి, గుజ్జును​ స్ట్రెయినర్​లో వేసి గింజలు తీసేయాలి. మరో పాన్​లో జామపండ్లు గుజ్జు, చక్కెర, చక్కెర పొడి వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరపడేవరకు  కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత ఒక ప్లేట్​కి వెన్న పూయాలి. అందులో ఈ మిశ్రమం వేసి కేక్​లా పరిచి, చల్లారేవరకు ఆరబెట్టాలి. తర్వాత చాకుతో మీకు నచ్చిన షేప్​లో కట్​ చేస్తే గ్వావా చీజ్​ రెడీ. ఈ గ్వావా చీజ్​ను పేస్ట్రీ షీట్ల మధ్యలో ​ పెట్టి తినొచ్చు. లేదా బ్రెడ్​తో కూడా ట్రై చేయొచ్చు.