కిచెన్ తెలంగాణ : వంకాయతో వెరైటీ శ్నాక్స్

కిచెన్ తెలంగాణ : వంకాయతో వెరైటీ శ్నాక్స్

వంకాయ(ఎగ్​ప్లాంట్​)ను... రెగ్యులర్​ కూరలా వండొచ్చు. మసాలా వేసి ఘాటుగా గ్రేవీ చేయొచ్చు. స్టఫ్​ చేసి నూనెలో వేగించి ఘుమఘుమలాడే గుత్తివంకాయలు చేసేయొచ్చు. ఇవేకాకుండా వంకాయలతో కొన్ని వెరైటీ శ్నాక్స్​ చేయొచ్చు. ఆ శ్నాక్స్​లో ఏ రెసిపీ ఎలా చేయాలో చదివి వెంటనే షురూ చేయండి. వాటిని తింటూ ఎంజాయ్​ చేయండి.

ఎగ్​ప్లాంట్ ఫింగర్స్

కావాల్సినవి :

పొడవు వంకాయలు - రెండు 

కోడిగుడ్డు - ఒకటి

మిరియాల పొడి - చిటికెడు

ఉప్పు, నూనె - సరిపడా

కార్న్​ఫ్లోర్, బ్రెడ్ క్రంబ్స్ - ఒక్కోటి ఒక్కో కప్పు చొప్పున

తయారీ : వంకాయల్ని కడిగి పొడవుగా, సన్నగా తరగాలి. ఒక ప్లేట్​లో కోడిగుడ్డు సొన, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. మరో ప్లేట్​లో కార్న్​ఫ్లోర్ తీసుకుని​, అందులో ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. అలాగే బ్రెడ్​ క్రంబ్స్​ కూడా విడిగా వేరే ప్లేట్​లో వేసి ఉంచాలి. వంకాయ ముక్కల్ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి, కార్న్​ఫ్లోర్​లో దొర్లించాలి. తర్వాత మళ్లీ కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్​ క్రంబ్స్​లో దొర్లించాలి. వీటిని వేడి నూనెలో వేగిస్తే... క్రిస్పీ ఎగ్ ప్లాంట్ ఫింగర్స్ రెడీ.

వంకాయ పట్టీ

కావాల్సినవి :

పెద్ద వంకాయ - ఒకటి

ఉల్లికాడలు - రెండు

వెల్లుల్లి రెబ్బలు - మూడు

 ఉప్పు, నూనె - సరిపడా

చీజ్, బ్రెడ్​ క్రంబ్స్ - ఒక్కో కప్పు చొప్పున

మిరియాల పొడి - పావు టీస్పూన్

తయారీ : వంకాయలు కడిగి వాటిపై పొట్టు తీసి,  ముక్కలుగా తరగాలి. పాన్​లో కొంచెం నూనె వేడిచేసి అందులో ఉల్లికాడలు, వెల్లుల్లి రెబ్బల తరుగు వేగించాలి. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కూడా వేసి పది నిమిషాలు ఉడికించాలి. వాటిని ఒక గిన్నెలో వేసి, మెత్తగా మెదపాలి. అందులో బ్రెడ్​ క్రంబ్స్, కొత్తిమీర, చీజ్ తరుగు వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఇరవై నిమిషాలు ఫ్రిజ్​లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి మిశ్రమాన్ని కొంచెంకొంచెంగా తీసుకుంటూ ఉండలు చేయాలి. వాటిని అరచేతిలో పెట్టి గారెల్లా వత్తాలి. పాన్​లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి గారెల్లా వత్తిన వాటిని వేగించాలి.

రోస్టెడ్ ఎగ్​ప్లాంట్

కావాల్సినవి :

వంకాయలు - రెండు

ఉప్పు, నూనె - సరిపడా

మిరియాల పొడి - పావు టీస్పూన్

కొత్తిమీర - కొద్దిగా

తయారీ : వంకాయల్ని కడిగి, ముక్కలు తరగాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని నూనె, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత పెనం మీద కాల్చాలి. లేదా ఒవెన్​లో ఇరవై నిమిషాలు ఉడికించాలి. తర్వాత వాటిపై కొత్తిమీర తరుగు చల్లుకుని తింటే సూపర్​ టేస్ట్​. 

వంకాయ పకోడీ

కావాల్సినవి :

పెద్ద వంకాయ - ఒకటి 

కోడిగుడ్లు - రెండు 

ఈస్ట్ - ఒక టీస్పూన్

మిరియాల పొడి - చిటికెడు

ఉప్పు, నూనె - సరిపడా

గోధుమపిండి - ఒక కప్పు 

మయోనైజ్​ - మూడు టీ స్పూన్లు

తయారీ : వంకాయను కడిగి ముక్కలు తరిగి, తురమాలి. అందులో ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత తురుములో నీళ్లని పిండి ఒక గిన్నెలో వేయాలి. అందులో కోడిగుడ్ల సొన, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. గోధుమ పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. చివరిగా ఈస్ట్​ కూడా వేసి కలపాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో వంకాయ మిశ్రమాన్ని పకోడీల్లా వేయాలి. వీటిని మయోనైజ్​​లో ముంచుకుని తింటే టేస్ట్​ బాగుంటుంది.

ఫ్లవర్ స్టఫింగ్

కావాల్సినవి :

వంకాయలు - నాలుగు

ఉల్లిగడ్డ - ఒకటి

వెల్లుల్లి రెబ్బలు - మూడు

నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు

ఉప్పు, నీళ్లు - సరిపడా

మటన్ కీమా - పావు కిలో

మయోనైజ్​ - ఒక టేబుల్ స్పూన్

కారం, ఆవాలు, ధనియాలు, మిరియాలు పొడి - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున

టొమాటో కెచప్, గ్రీన్ హెర్బ్స్ (మార్కెట్​లో దొరుకుతుంది) - ఒక టీస్పూన్

తయారీ : వంకాయలు కడిగి చివర్లు కట్ చేయాలి. తర్వాత వాటిని సగభాగం చేయాలి. ఒక్కోదాన్ని  నిలువుగా పూరేకుల్లా కట్ చేయాలి. ఒక గిన్నెలో ఉల్లిగడ్డ తురుము, మటన్ కీమా, కారం, ఆవాలు, ధనియాలు, మిరియాలు పొడి, మయోనైజ్​ లేదా కోడిగుడ్డు సొన వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫ్లవర్ ఆకారంలో ఉన్న వంకాయల్లో స్టఫ్​​ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి ఒక టీస్పూన్ ఉప్పు వేయాలి. స్టఫ్ చేసిన వంకాయల్ని పాన్​ మీద పెట్టాలి. కాసేపటి తర్వాత వాటిని తిప్పి మరో వైపు ఉడికించాలి. టొమాటో కెచప్​, గ్రీన్ హెర్బ్స్ వేసి నీళ్లు పోసి కలపాలి. ఆ మిశ్రమాన్ని వంకాయల మీద పోయాలి. ఆపై అరగంటసేపు ఒవెన్​లో లేదా ఆవిరి మీద ఉడికించాలి. తినడానికి రెడీ అయిన వీటిని ఏదైనా సాస్​లో డిప్​ చేసుకుని తింటే టేస్ట్​ అదిరిపోతుంది.