సమ్మర్ స్పెషల్.. కీరదోసతో వెరైటీలు ఇలా ట్రై చెయ్యండి

సమ్మర్ స్పెషల్.. కీరదోసతో వెరైటీలు  ఇలా ట్రై చెయ్యండి

కీరదోస సమ్మర్​లో ఎక్కువగా వాడుతుంటారు. ఒంటికి చలువ చేస్తుందని చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే, రోజూ ఒకే పద్ధతిలో తినాలంటే బోర్​ కొడుతుంది. కాబట్టి ఈ సమ్మర్​లో ఇలా ట్రై చేసి చూడండి. 


తంబులి

కావాల్సినవి :
కీరదోస తరుగు, పెరుగు - ఒక్కో కప్పు
పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు - ఒక్కోటి పావు కప్పు
పచ్చిమిర్చి, ఎండు మిర్చి - రెండేసి చొప్పున
వెల్లుల్లి రెబ్బలు - మూడు
మిరియాలు - అర టీస్పూన్
నువ్వులు, ఆవాలు, జీలకర్ర - ఒక్కో టీస్పూన్ చొప్పున
ఉప్పు, నూనె - సరిపడా
కరివేపాకు - కొంచెం

తయారీ :

మిక్సీజార్​లో కీరదోస తరుగు కొంచెం, కొబ్బరి తురుము, మిరియాలు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, నువ్వులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో కీరదోస తరుగు మిగతా కొంచెం వేసి కలపాలి. పాన్​లో నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. ఆ తాలింపును కీరదోస మిశ్రమంలో వేసి కలిపితే సరి.


కీర ఇడ్లీ 


కావాల్సినవి :
బొంబాయి రవ్వ - ఒక కప్పు
కీరదోస - ఒకటి
పెరుగు, పచ్చికొబ్బరి ముక్కలు - ఒక్కోటి పావు కప్పు
నీళ్లు, ఉప్పు - సరిపడా
పల్లీలు - ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర - కొంచెం
పచ్చిమిర్చి - రెండు
బేకింగ్ సోడా - ఒక టీస్పూన్

తయారీ :

ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. కొన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలపాలి. కీరదోసను తురమాలి. ఆ తురుమును ఇడ్లీ పిండి మిశ్రమంలో కలపాలి. మిక్సీజార్​లో పల్లీలు, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని కూడా అందులో వేసి కలపాలి. అవసరమైతే కొంచెం ఉప్పు, కారం కూడా వేయొచ్చు. ఆ మిశ్రమాన్ని తాలింపు వేసి, అందులో బేకింగ్ సోడా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికిస్తే సరి. 

జొన్న రొట్టె

కావాల్సినవి :
కీరదోస కాయలు - రెండు
ఉల్లిగడ్డ - ఒకటి
పుదీనా, కొత్తిమీర - కొంచెం
జొన్న పిండి - ఒక కప్పు
జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక్కోటి అర టీస్పూన్
వాము - పావు టీస్పూన్
పచ్చిమిర్చి - రెండు
ఉప్పు - సరిపడా


తయారీ : కీరదోసకాయల్ని తురిమి ఒక గిన్నెలో వేయాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. తర్వాత అందులో జొన్న పిండి వేసి ముద్దగా కలపాలి. కొంచెం పిండిని తీసుకుని, తడి క్లాత్​ మీద పెట్టి రొట్టెలా చేత్తో అదమాలి. ఆపై వేడి పాన్​లో వేసి రెండు వైపులా కాల్చాలి. మిగతా పిండిని కూడా అలాగే రొట్టెల్లా చేసి కాల్చుకుంటే సరి.