బాసరకు పోటెత్తిన భక్తులు.. భారీగా అక్షరాభ్యాసాలు

 బాసరకు పోటెత్తిన భక్తులు.. భారీగా అక్షరాభ్యాసాలు

నిర్మల్‌ : నిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో ఇవాళ వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక సేవలో ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

వసంత పంచమిని పురస్కరించుకుని భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్‌లలో నిలబడి ఉన్నారు.  తెల్లవారుజామున 3 గంటల నుంచి చిన్నారులకు  తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. కాగా, భక్తుల రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

 వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో

వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో ఇవాళ తెల్లవారుజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు కావడంతో దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.