బీఆర్ఎస్​ లీడర్ల అటాక్​.. వట్టె జానయ్యపై కత్తులు, గొడ్డళ్లతో దాడి

బీఆర్ఎస్​ లీడర్ల అటాక్​..  వట్టె జానయ్యపై కత్తులు, గొడ్డళ్లతో దాడి

సూర్యాపేట, వెలుగు: బీఎస్పీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్​పై గొడ్డలితో దాడి చేశారు. సూర్యాపేట పరిధి ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్​లో ఆదివారం రాత్రి జానయ్య ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్​కు చెందిన సామ తిరుమల్ రెడ్డి, అతని కొడుకు రాజశేఖర్ రెడ్డి కత్తులు, గొడ్డళ్లతో ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో జానయ్య పక్కనే ఉన్న డ్రైవర్ చింత రమేశ్​అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతడి చేతి వేలు తెగిపోయింది. జానయ్య సల్ప గాయాలతో బయటపడ్డారు. దాడి ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

 దాడి జరిగినప్పుడు  పోలీసులు పక్కనే ఉన్నప్పటికీ పట్టించుకోలేదంటూ బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎస్సైని సస్పెండ్ చేయాలంటూ అక్కడే బైఠాయించారు. దాడి జరిగిన తర్వాత వట్టె జానయ్య వెళ్లి ఆత్మకూరులో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎస్సై పట్టించుకోలేదని ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ నాగభూషణం, సీఐ అశోక్ రెడ్డి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వాళ్లు ఆందోళన విరమించారు. 

తర్వాత జానయ్యను, రమేశ్​ను సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఎదుటా జానయ్య అనుచరులు, బీఎస్పీ కార్యకర్తల ఆందోళనకు దిగారు. జానయ్య పై జరిగిన దాడిని నిరసిస్తూ సూర్యాపేటలో హైదరాబాద్– విజయవాడ నేషనల్ హైవేపై జానయ్య భార్య రేణుక అనుచరులతో కలిసి రాస్తారోకోకు దిగారు. అర్ధరాత్రి వరకు ఆందోళన చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.