వేదాంత నష్టం రూ.1,783 కోట్లు

వేదాంత నష్టం రూ.1,783 కోట్లు

న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో రూ. 1,783 కోట్ల  నికర నష్టాన్ని (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. కొత్త పన్ను రేటును స్వీకరించడం వల్ల బ్యాలెన్స్ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘వన్​టైమ్​ ఎక్సెప్షనల్​ ఐటెం’ చేరిందని పేర్కొంది. కంపెనీ గత ఏడాది కాలంలో రూ. 1,808 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసిందని వేదాంత లిమిటెడ్ బీఎస్​ఈ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలిపింది.

వేదాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ, కంపెనీ చేసిన  ‘వన్​టైం రైట్​డౌన్​’ వల్లే నష్టాలు వచ్చాయని చెప్పారు. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే కొత్త పన్ను విధానాన్ని అవలంబించడం వల్ల 6,128 కోట్ల రూపాయల నికర పన్ను ప్రభావం ఒక్కసారిగా పడిందని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జులై–-సెప్టెంబర్ కాలంలో కంపెనీ ఆదాయం రూ. 39,585 కోట్లకు చేరింది. గత ఏడాది సెప్టెంబరు క్వార్టర్​లో రూ. 37,351 కోట్లు వచ్చాయి.

2024 ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​లో, ఆదాయం వార్షికంగా ఆరు శాతం  పెరిగి రూ. 38,546 కోట్లకు చేరుకుంది. అధిక అమ్మకాలు, మార్పిడి రేటులో అనుకూలమైన కదలిక,  అనుకూలమైన ఆర్బిట్రేషన్​ అవార్డు కారణంగా ఆదాయం పెరిగిందని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ స్థూల రుణం రూ. 74,473 కోట్లు ఉంది. వేదాంత... వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్  అనుబంధ సంస్థ. ఇది భారతదేశంతో పాటు దక్షిణాఫ్రికా,  నమీబియా అంతటా చమురు  గ్యాస్, జింక్, సీసం, వెండి, రాగి, ఇనుప ఖనిజం, ఉక్కు, అల్యూమినియంలను వెలికితీస్తుంది.