ప్రాకార మండపంలో సీతారామయ్యకు అభిషేకం

 ప్రాకార మండపంలో సీతారామయ్యకు అభిషేకం
  • వేదోక్తంగా తిరుప్పావై ప్రవచనం.. ఆండాళ్లమ్మకు తిరువీధి సేవ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకి బుధవారం ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. మూలవరులకు సుప్రభాత సేవ అనంతరం ఉత్సవమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం చేశారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. ధనుర్మాసోత్సవం సందర్భంగా తిరుప్పావై ప్రవచనాన్ని ఎస్టీపీ సువర్ణ భక్తులకు వివరించారు. 

ప్రవచనం అనంతరం ఆండాళ్లమ్మ అమ్మవారికి తిరువీధి సేవ పల్లకీలో మాడవీధుల్లో ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. సీతారామచంద్రస్వామికి బేడా మండపంలో నిత్య కల్యాణం జరిగింది. భక్తులు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించారు. సాయంత్రం దర్బారు సేవ చేసి దివిటీ సలాంను స్వామికి సమర్పించారు. భద్రాచలంలోని తానీషా కల్యాణమండపం రోడ్డులో ఉన్న ప్రేమనీలా అనే భక్తురాలు సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ను విరాళంగా అందజేశారు. 

ముక్కోటికి సాంస్కృతిక కార్యక్రమాలు 

ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఈనెల 20 నుంచి 30వరకు మిథిలాస్టేడియంలో, పర్ణశాల దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో దామోదర్​రావు తెలిపారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్​ను రిలీజ్​ చేశారు.  ఈనెల 20న మత్స్యావతారం రోజున చాలీసా పారాయణం, భగవద్గీత శ్లోకాలు, భక్తరామదాసు హరికథ, కూచిపూడి నృత్యం, లవకుశ నాటకం, పర్ణశాలలో ద్రౌపదీ స్వయంవరం హరికథ, 21న కూర్మావతారం రోజున ఆళ్వార్ల చరిత్ర హరికథా కాలక్షేపం, సీతారామ కల్యాణం నాటకం, పర్ణశాలలో భీష్మ ప్రతిజ్ఞ హరికథ, 22న వరాహవతారం రోజున రుక్మిణీ కల్యాణం హరికథ, భూకైలాష్​ నాటకం, పర్ణశాలలో సుభద్రా పరిణయం హరికథ, 23న నరసింహావతారం రోజున హనుమత్ సందేశం హరికథ, భక్తప్రహ్లాద నాటకం, పర్ణశాలలో గజేంద్రమోక్షం హరికథ, 24న వామనావతారం రోజున సుగ్రీవపట్టాభిషేకం హరికథ, మాయాబజార్​ నాటకం, పర్ణశాలలో శ్రీరామపాదుకా పట్టాభిషేకం హరికథ, 25న పరశురామావతారం రోజున పరశురామ విజయం హరికథ, శ్రీకృష్ణతులాభారం నాటకం, పర్ణశాలలో భక్త కుచేల హరికథ, 26న శ్రీరామావతారం రోజున శ్రీరామజననం హరికథ, శ్రీనివాస కల్యాణం నాటకం, పర్ణశాలలో పర్ణశాల హరికథ, 27న బలరామావతారం రోజున భక్తపోతన హరికథ, శ్రీరామదర్శనం పద్యనాటకం, పర్ణశాలలో సీతారామ కల్యాణం హరికథ, 28న కృష్ణావతారం రోజున రుక్మిణీ కల్యాణం హరికథ,శ్రీకష్ణలీలలు నాటకం, పర్ణశాలలో రుక్మిణీ కల్యాణం హరికథ, 30న రామనామ సంకీర్తనం భజన ఉంటాయని వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించాలని కోరారు.