ఘనంగా వీరభద్రుడి కల్యాణం

ఘనంగా వీరభద్రుడి కల్యాణం
  • అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు 

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: సంగారెడ్డి జిల్లా వీరన్నగూడెం (బొంతపల్లి)లోని  శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలను ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు.  ఉత్సవాల్లో  భాగంగా గురువారం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు  స్వామి వారి కల్యాణోత్సవాన్ని  తిలకించి పరవశించిపోయారు. 

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శశిధర్, ఎంపీపీ ప్రవీణ, పటాన్​చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎంపీటీసీ నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింగరావు, మాజీ సర్పంచ్ మమత, నాయకులు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ యాదవ్,  ఆలయ సిబ్బంది సోమయ్య, రవీందర్ పాల్గొన్నారు.  
 

భక్తి శ్రద్ధలతో అగ్ని గుండాలు
 

స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారి కల్యాణం నిర్వహించగా అంతకు ముందు తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన ద్వారం ముందు ఏర్పాటు చేసిన అగ్ని గుండాల్లో భక్తులు నడిచిమొక్కులు చెల్లించుకున్నారు.