- కేంద్ర వ్యవసాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణకాంత్ దూబే
గద్వాల, వెలుగు: కూరగాయల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ కాంత్ దూబే తెలిపారు. సాధారణ పంటలతో పాటు కూరగాయల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాలో పర్యటించారు.
అలంపూర్ మండలం బుక్కాపూర్ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోట, టీజీ ఆయిల్‌ఫెడ్ బీచుపల్లి నర్సరీ, కూరగాయల తోటలు, మునగాల, షాబాద్, ఇటిక్యాల గ్రామాల్లోని ఆయిల్ పామ్ తోటలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం కలెక్టరేట్ లో పీఎండీడీకేవై స్కీమ్ అమలుపై ఆఫీసర్లతో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు వాటి అనుబంధరంగాల్లో రైతులు రాణిస్తేనే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు తమ పొలాల్లో ఉద్యాన పంటలు పండించాలని, మత్స్య, పాడి పరిశ్రమపై దృష్టి పెట్టి ఆర్థికంగా ఎదగాలన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ అక్బర్, టీజీ ఆయిల్ ఫెడ్ ఏడీఏ శివనాగిరెడ్డి, డీఏవో సక్రియా నాయక్, సంగీత లక్ష్మి, డివిజనల్ హార్టికల్చర్ ఆఫీసర్లు రాజశేఖర్, ఇమ్రాన్, మహేశ్, వినీత్ పాల్గొన్నారు.
