2022లో 23శాతం పెరిగిన బండ్ల అమ్మకాలు

2022లో 23శాతం పెరిగిన బండ్ల అమ్మకాలు
  • ఎస్​యూవీలకు మస్తు డిమాండ్​

న్యూఢిల్లీ: మనదేశ మార్కెట్​లో ప్యాసింజర్ వెహికల్స్​ అమ్మకాలు పోయిన ఏడాది 23 శాతం పెరిగి 2022లో 37.93 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్,  టాటా మోటార్స్ కంపెనీలు కరోనా  సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నాయి.సెమీకండక్టర్ కొరత తగ్గడం, ఎస్​యూవీలకు విపరీతంగా డిమాండ్​ పెరగడంతో భారీగా కస్టమర్లను సంపాదించుకున్నాయి. 

టయోటా కిర్లోస్కర్ మోటార్,  స్కోడా ఇండియా వంటి ఇతర తయారీదారులు కూడా 2022లో రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించాయి. 2022లో హోల్‌‌‌‌సేల్స్  38 లక్షల యూనిట్ల వరకు ఉన్నాయని, 2021లో 30.82 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని  మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మార్కెటింగ్ & సేల్స్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.  2022 హోల్‌‌సేల్స్​ ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఎప్పుడూ లేనంత అత్యధికమని అన్నారు. ఎస్​యూవీలకు డిమాండ్ పెరుగుతూనే ఉందని,  మొత్తం పీవీ అమ్మకాలలో వీటి సంఖ్య దాదాపు 42.3 శాతంగా ఉందని ఆయన అన్నారు. 

అమ్ముడైన వెహికల్స్​లో దాదాపు 40 శాతం రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బ్రాకెట్‌‌లో ఉన్నాయి. మారుతీ సుజుకీ  2022  క్యాలెండర్ సంవత్సరంలో 15.76 లక్షల యూనిట్లను అమ్మింది.  2021 సంవత్సరంలో 13.64 లక్షల యూనిట్లు అమ్మింది. ఇది దాదాపు 16 శాతం వృద్ధిని సాధించింది.    హ్యుందాయ్ 2021 సంవత్సరంలో 5,05,033 యూనిట్లు విక్రయించగా..2022లో  5,52,511 యూనిట్లను అమ్మింది.   టాటా మోటార్స్   గత ఏడాది 5,26,798 యూనిట్లను అమ్మింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 2021 సంవత్సరంలో 1,30,768 యూనిట్ల నుంచి 23 శాతం వృద్ధితో 2022లో మొత్తం 1,60,357 యూనిట్లకు చేరాయి.  స్కోడా అమ్మకాలు 23,858 యూనిట్ల నుంచి 53,721 యూనిట్లకు పెరిగాయి. 

9 శాతం తగ్గిన మారుతీ టోకు అమ్మకాలు

మారుతీ సుజుకి హోల్​సేల్స్​ గత నెలలో 1,13,535 యూనిట్లుగా కాగా,  2021  డిసెంబర్లో1,26,031 యూనిట్లను అమ్మింది. అంటే వార్షికంగా అమ్మకాలు 9.91 శాతం తగ్గాయి.     హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు ఇదేకాలంలో 32,312 యూనిట్ల నుంచి (20.2 శాతం వృద్ధి) 38,831 యూనిట్లకు చేరుకున్నాయి. టాటా మోటార్స్ కూడా తన దేశీయ ప్యాసింజర్ వెహికల్​ విక్రయాలలో 13.4 శాతం వృద్ధిని సాధించింది. అమ్మకాలు  35,299 యూనిట్ల నుంచి 40,043 యూనిట్లకు పెరిగాయి.