వెల్మకన్న గ్రామస్తులు ప్రభుత్వ భూమిని కాపాడాలని హైవేపై ఆందోళన

వెల్మకన్న గ్రామస్తులు ప్రభుత్వ భూమిని కాపాడాలని హైవేపై ఆందోళన

కౌడిపల్లి, వెలుగు: ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ వెల్మకన్న గ్రామస్తులు ఆదివారం కౌడిపల్లిలో నేషనల్ హైవే పై ఆందోళన చేశారు. కబ్జాదారులకు  స్థానిక మాజీ ప్రజాప్రతినిధి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. వెల్మకన్న శివారులో ఉన్న 447 సర్వే నెంబర్ లోని అసైన్డ్ భూమి కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కౌడిపల్లికి చెందిన మోతీలాల్ గౌడ్ పొజిషన్ లో లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారిలో 3.20 ఎకరాలకు  రెవెన్యూ అధికారులు  అసైన్డ్ పట్టా ఇచ్చారని ఆరోపించారు. 

ఇదే సర్వే నెంబర్ లో సదాశివపల్లికి చెందిన మాజీ సర్పంచ్ 2 ఎకరాల అసైన్డ్ పట్టా పొందారని ఆరోపించారు. మోతీలాల్ గౌడ్ కు మూడుసార్లు అసైన్​మెంట్ పట్టా ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. వెల్మకన్న శివారులో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ఇండ్లు లేని పేదలకు, డిగ్రీ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై గంటపాటు ధర్నా చేయడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వెళ్లి ధర్నా చేస్తున్న వారికి నచ్చజెప్పి విరమింప చేశారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు