V6 News

హేతువాది వీరుడు కందుకూరి.. తెలుగు సాహిత్య చరిత్రలో వీరేశలింగ తొలి అడుగులు!

హేతువాది వీరుడు కందుకూరి.. తెలుగు సాహిత్య చరిత్రలో వీరేశలింగ తొలి అడుగులు!

అది1881 డిసెంబర్11. రాజమహేంద్రవరం వీధులన్నీ కోలాహలంగా ఉన్నాయి. గోగులపాటి శ్రీరాములు, -గౌరమ్మ వివాహం జరుగుతోంది. ఇది సాధారణ పెళ్లి కాదు – తెలుగు నేలపై మొదటి వితంతు వివాహం. కందుకూరి వీరేశలింగం పంతులు ముందు నిలబడి ఉన్నారు. బయటి నుంచి కొందరు రాళ్లు విసురుతున్నారు. గాల్లో ఇంకొందరు శాపనార్థాలు పెడుతున్నారు. కానీ ఆయన ముఖంపై చిరునవ్వు! “సమాజం మారాలంటే ఒక్కడు ముందడుగు వేయాలి” అన్నట్టు, ఆ రోజు తెలుగు సమాజ చరిత్ర మారిపోయింది. 

ఈ ఒక్క సంఘటన కాదు... వీరేశలింగం జీవితమంతా అలాంటి సాహసాలతో నిండి ఉంది. చిన్న వయసులోనే విధి ఆయనకు పెట్టిన పరీక్షలు నెగ్గడం, హేతువాదిగా పోరాటం, సాహిత్యంలో తొలి అడుగులు, సమాజ సంస్కరణలో అపూర్వ త్యాగం.. ఇవన్నీ కలగలసిన ఈయన జీవితం కేవలం కథ కాదు. ఒక యుగపురుషుడి సాహస గాథ.

1848 ఏప్రిల్16న రాజమహేంద్రవరంలో జన్మించారు కందుకూరి వీరేశలింగం. ఆరు నెలల వయసులోనే స్మాల్‌‌‌‌‌‌‌‌పాక్స్‌‌‌‌‌‌‌‌తో పోరాడి బయటపడ్డారు. నాలుగేళ్ల వయసులో తండ్రి సుబ్బారాయుడు చనిపోయారు. పేదరికం, అనాథత్వం... కానీ తల్లి పూర్ణమ్మ పట్టుదలతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. చదువులో అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఒకసారి ఇంగ్లిష్ టీచర్​ నాణ్యతగల విద్యను అందించడం లేదని విద్యార్థులతో కలిసి స్ట్రైక్ చేశారు. దాంతో ఆ స్కూల్​ హెడ్‌‌‌‌‌‌‌‌మాస్టర్ మారిపోయారు. ఆయనకు చదువంటే ఎంతిష్టమో చెప్పడానికి మరో ఉదాహరణ ఏంటంటే.. చిన్న వయసులోనే రెండు శతకాలు రాశారు. అంతటి గొప్ప మేధావి వీరేశలింగం. 

  • హేతువాది వీరుడు

వీరేశలింగం రేషనలిస్ట్. భూతాలు, ఆత్మలు ఉంటాయని నమ్మేవారిని ఎదుర్కొనేందుకు ఒంటరిగా శ్మశానంలో రాత్రి సమయంలో వెళ్లేవారు. ‘భయపడితే ఎలా సంస్కరణ చేస్తాం?’ అనే ధోరణితో మూఢాచారాలు, అవినీతి, వేశ్య, కుల వ్యవస్థలపై తీవ్రంగా ప్రతిఘటిస్తూ రచనలు చేశారు. చిన్నవయసులోనే ఆయనకు పెండ్లి జరిగినప్పటికీ బాల్యవివాహాలకు వ్యతిరేకిగానే ఉన్నారు. వివేకవర్ధిని పత్రిక ద్వారా మహిళల స్థితి, బాల్య వివాహాలు వంటి దురాచారాలను ఎండగట్టారు. ఆ సమయంలో “భారతదేశం పతనం మహిళల స్థితి క్షీణించినప్పుడే మొదలైంది” అని రాశారు.

  • సాహిత్యంలో ‘తొలి’ అడుగులు 

తెలుగు సాహిత్య చరిత్రలో తిక్కన పద్య సాహిత్యానికి అపూర్వమైన శైలి, సరళత, శక్తి ఇచ్చిన మహాకవి. అలాగే గద్య సాహిత్యానికి అదే స్థాయిలో సేవ చేసిన వ్యక్తి వీరేశలింగం. కాబట్టి ఆయనను “గద్య తిక్కన” అని బిరుదు ఇచ్చి గౌరవించారు. తెలుగులో మొదటి సాంఘిక నవల ‘రాజశేఖర చరిత్రము’ పేరుతో రాశారు. తెలుగులో మొదటి ఆత్మకథ రాసిన రచయిత ఈయనే. తొలి ప్రహసనాలు, నాటకాలు, వ్యాసాలు, శాస్త్ర గ్రంథాలు, తొలి ఆంధ్ర కవుల చరిత్ర ఇలా ఎన్నో విషయాల్లో కొత్తదనాన్ని రుచి చూపించిన రచయిత కందుకూరి. సాహిత్యాన్ని సంస్కరణ ఆయుధంగా మార్చిన వ్యక్తి. తెలుగు సాహిత్యానికి ఆయన ‘నవయుగ వైతాళికుడు’. 

  • స్త్రీ సంస్కరణలో అపూర్వ సాహసం

1874లో ధవళేశ్వరం (దౌలేశ్వరం)లో బాలికల పాఠశాల ప్రారంభించారు. తానే చదువు చెప్పేవారు. మగ-, ఆడ పిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా పద్ధతి ప్రవేశపెట్టారు. అంటరాని కులాల పిల్లలకు ఉచిత విద్య, పుస్తకాలు ఇచ్చేవారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు సాహసం వితంతు వివాహాలు. ధర్మ శాస్త్రాలను ఉదహరించి వాదించేవారు. ప్రతిపక్ష సభలు, డిబేట్లు, దాడులు మధ్య ఎన్నో ఘర్షణలు ఎదుర్కొన్నారు. రీమ్యారేజ్ అసోసియేషన్ స్థాపించి విద్యార్థులను రాష్ట్రమంతా పంపించి వితంతువులకు వరుళ్లను వెతికేవారు. ఆయన జీవితం మొత్తంలో సుమారు 40 వితంతు వివాహాలు జరిపించారు. 

  • చివరి రోజులు 

ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని పూర్తి సమయం సంస్కరణలకు అంకితం చేసిన కందుకూరి1887లో బ్రహ్మ మందిరం నిర్మించారు. హితకరిణి సమాజం ద్వారా ఆస్తి దానం చేశారు. 1919 మే 27న మద్రాసులో పరమపదించారు. “మార్పు కోసం ఒక్కడు సాహసం చేస్తే చాలు, సమాజం మారుతుంది” అని ఆయన జీవితం చెప్తోంది. ఈరోజు మహిళా విద్య, సమానత్వం కోసం పోరాడేవారందరికీ ఆయన ఒక స్ఫూర్తి. ఇలాంటి సంస్కర్తలు ఉన్నందుకే తెలుగు నేల ఇప్పటికీ గర్వంగా నిలుస్తోంది.

  • నాటకరంగ దినోత్సవం

ఏప్రిల్16న కందుకూరి జయంతి సందర్భంగా ఈరోజును నాటకరంగ దినోత్సవంగా గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. రాజమహేంద్రవరం, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు వంటి చోట్ల సభలు, సెమినార్లు, నాటక ప్రదర్శనలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం సాధారణం. ఇది ఆయన సాహిత్య సేవను గుర్తు చేస్తుంది. బాల్య వివాహాల నిర్మూలన, వితంతు వివాహాల ప్రోత్సాహం, స్త్రీ విద్య, మూఢాచారాల వ్యతిరేకతపై చర్చలు, వ్యాసాలు, పోస్టర్లు, పాఠశాలలు, కళాశాలల్లో వీరేశలింగం జీవితం, సంస్కరణలపై ప్రత్యేక తరగతులు, వ్యాసాలు, చిత్ర పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా ఈ రోజున తెలుగు నాటకరంగం, సాహిత్యం, సంఘ సంస్కరణలకు సేవ చేసిన వ్యక్తులకు కందుకూరి అవార్డులు అందజేస్తుంటారు. 

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ
featureseditor@v6velugu.com