వేములవాడ, వెలుగు : దక్షిణకాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తొలుత తలనీలాల మొక్కులు చెల్లించుకుని పవిత్రస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించి శ్రీస్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రమాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శ్రీభీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామివారిని వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఏపీ మాజీ డీజీపీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఈవో రమాదేవి వారికి శేష వస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శివసాయి, ఆలయ ఉద్యోగులు ఉన్నారు.
