కనులపండువగా శివపార్వతుల లగ్గం

కనులపండువగా శివపార్వతుల లగ్గం
  • భారీ సంఖ్యలో హాజరైన భక్తులు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణాన్ని గురువారం కనులపండువగా నిర్వహించారు. ముందుగా వరుడి తరఫున ఈవో, వధువు తరఫున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి ఎదుర్కోళ్లు జరిపారు. కన్యాదాతలుగా భీమా శంకర్‌‌ శర్మ, ఇందిర వ్యవహరించారు. అనంతరం స్థానాచార్యులు అప్పాల భీమా శంకర్‌‌శర్మ అధ్వర్యంలో ఉదయం 10‌‌‌‌.55 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం నిర్వహించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్, మున్సిపల్‌‌ కమిషనర్‌‌ అన్వేశ్‌‌ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులతో పాటు వేలాది మంది శివపార్వతులు, జోగినిలు, ట్రాన్స్‌‌జండర్లు హాజరయ్యారు. స్వామి వారి కల్యాణం జరిగే టైంలో ఒకరిఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. కల్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌, వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌, మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్‌‌ రామతీర్థపు మాధవీరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఆర్డీవో రాజేశ్వర్‌‌ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.