వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా మచాడోకు శాంతి నోబెల్

వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా మచాడోకు శాంతి నోబెల్
  •  
  • ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమానికి గుర్తింపుగా అవార్డు
  • ప్రెసిడెంట్ మదురో నియంతృత్వంపై పోరాటం.. ఏడాదిగా అజ్ఞాతంలోనే.. 
  • నిరుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడంతో అనర్హత వేటు 
  • ఈ అవార్డు వెనెజువెలా ప్రజలకు, ట్రంప్​కు అంకితమన్న మరియా

ఓస్లో(నార్వే):   వెనెజువెలా అపొజిషన్ లీడర్, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమ నేత, ఉక్కు మహిళ మరియా కొరీనా మచాడో(58)కు ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. స్వదేశంలో అణచివేతలు, బెదిరింపులు, నిర్బంధాలను లెక్క చేయకుండా ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు, ఏడాది కాలంగా అజ్ఞాతంలో ఉండి కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నందుకు గుర్తింపుగా ఆమెను 2025 నోబెల్ పీస్ ప్రైజ్ కు ఎంపిక చేసినట్టు శుక్రవారం నార్వేలోని ఓస్లోలో నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. ‘‘వెనెజువెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం అలుపెరగని కృషి చేస్తున్నందుకు, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి శాంతియుతంగా అధికార బదిలీ కోసం పోరాటం చేస్తున్నందుకు గుర్తింపుగా మచాడోకు ఈ అవార్డును ప్రకటిస్తున్నాం” అని వెల్లడించింది. ‘‘మచాడో ఎంతో ధైర్యవంతమైన పీస్ చాంపియన్. పెరుగుతున్న చీకట్లలో ప్రజాస్వామ్య కాగడా ఆరిపోకుండా చూస్తున్న నాయకురాలు” అని కమిటీ ప్రశంసించింది.  

ఏడాదిగా అజ్ఞాతంలోనే.. 

మరియా కొరీనా మచాడో వెనెజువెలాలోని కారకస్ లో 1967, అక్టోబర్ 7న జన్మించారు. స్యూల్ ఎడ్యుకేషన్ తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. వెనెజువెలాలో అధ్యక్షుడు నికోలస్ మదురో ఆధ్వర్యంలో కొనసాగుతున్న నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మచాడో పోరాడుతున్నారు. 2013లో ‘వెంటె వెనెజువెలా’ పేరుతో లిబరల్ పొలిటికల్ పార్టీని స్థాపించి, దానికి నేషనల్ కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నారు. 2010లో ఆమె వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ మెంబర్ గా అత్యధిక మెజార్టీతో గెలిచారు. 2015 వరకూ ఆ పదవిలో కొనసాగారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురోపై పోటీ కోసం ప్రతిపక్ష అభ్యర్థిగా మచాడో ఎన్నికయ్యారు. కానీ ఆమెపై పెట్టిన కేసులను సాకుగా చూపుతూ మదురో ప్రభుత్వం ఆమెపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఎన్నికల్లో మదురో గెలిచిన తర్వాత మచాడోపై నిర్బంధం మరింత పెంచింది. దీంతో ఏడాది కాలంగా ఆమె స్వదేశంలోనే అజ్ఞాతంలో ఉంటున్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే అప్పుడప్పుడూ కమ్యూనికేట్ అవుతున్నారు. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా హక్కుల కోసం పోరాడుతున్నందుకు అక్కడి ప్రజలు ఆమెను ‘ఐరన్ లేడీ’గా పిలుచుకుంటున్నారు. మచాడోకు ఈ ఏడాది టైమ్ పత్రిక ‘ది 100 మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్’ జాబితాలోనూ చోటు దక్కింది. 

ఈ అవార్డు వెనెజువెలా ప్రజలకు, ట్రంప్​కు అంకితం: మచాడో 

తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని వెనెజువెలా ప్రజలకు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు అంకితం ఇస్తున్నానని మరియా కొరీనా మచాడో ప్రకటించారు. నికోలస్ మదురో నియంతృత్వ సర్కారును గద్దె దింపేందుకు పోరాడుతున్న వెనెజువెలా ప్రజలకు ట్రంప్ అండగా నిలుస్తున్నారని ఆమె కొనియాడారు. కాగా, దక్షిణ అమెరికాలోని వెనెజువెలా నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాపై ట్రంప్ ఇటీవల ఉక్కుపాదం మోపారు.  నికోలస్ మదురో అండతోనే డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందంటూ ఆ దేశంతో దౌత్య సంబంధాలను రద్దు చేశారు. మదురోను పట్టి తెచ్చేవాళ్లకు రివార్డ్ ను కూడా రెట్టింపుగా 50 మిలియన్ డాలర్లకు పెంచారు. ఈ నేపథ్యంలో వెనెజువెలా డ్రగ్స్ ముఠాలపై ట్రంప్ ఉక్కుపాదం మోపడాన్ని మచాడో గత ఆగస్టులో స్వాగతించారు. దేశంలో క్రిమినల్, టెర్రరిస్ట్ వ్యవస్థలు అధికారం చెలాయిస్తున్నాయని, వీటిని నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు గాను ట్రంప్ కు వెనెజువెలన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు.