- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది విద్యార్థులు
నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే విద్యార్థులను నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మొత్తం 47 మంది విద్యార్థుల్లో 17 మంది అస్వస్థకు గురయ్యారు. కాగా.. బుధవారం చేసిన సాంబారుతో వడ్డించడమే ఫుడ్ పాయిజన్ కు కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.
స్కూల్ లో వంట చేయకుండా సిబ్బంది తమ ఇంటి వద్ద చేసి తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులు కోలుకుంటున్నారని , మెరుగైన వైద్యం అందిస్తున్నామని నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్తెలిపారు.
ఘటనపై తెలిసిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కాంగ్రెస్ నేతలు నగేశ్షెట్కర్, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన టీచర్ కాశీనాథ్ కు షోకాస్ నోటీసు, వంట మనిషి నాగమణిని విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
