మోత్కూరు సింగిల్ విండో చైర్మన్ గా వెంకటేశ్వర్లు

మోత్కూరు సింగిల్ విండో చైర్మన్ గా వెంకటేశ్వర్లు
  • చైర్మన్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న 9 మంది డైరెక్టర్లు 
  • 25 ఏళ్ల తర్వాత మరొకరికి దక్కిన చైర్మన్ పదవి 

మోత్కూరు, వెలుగు : మోత్కూరు సింగిల్ విండో నూతన చైర్మన్ గా పేలపూడి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. అవినీతి ఆరోపణలతో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డిపై వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లుతో సహా 9 మంది డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించి మే 21న యాదాద్రి డీసీవో ప్రవీణ్ కుమార్ ను కలిసి నోటీసు ఇచ్చారు. ఈనెల 11న అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించి నెగ్గారు. దీంతో చైర్మన్ అశోక్ రెడ్డి పదవి కోల్పోవడంతో నూతన చైర్మన్ ఎన్నిక కోసం డీసీవో నోటిఫికేషన్ జారీ చేసి గురువారం ఉదయం 11 గంటలకు నూతన చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. 

వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లును చైర్మన్ గా బలపరుస్తూ డైరెక్టర్లు డాక్టర్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, తాళ్లపల్లి స్వామి సూచించగా, మిగతా డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, బండ పద్మ, ఆకుల వెంకటేశ్వర్లు, బయ్యని చంద్రశేఖర్, జిట్ట లక్ష్మయ్య, కారుపోతుల ముత్తయ్య, బండ పద్మ, బుశిపాక సుజాత చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో చైర్మన్ గా వెంకటేశ్వర్లు ఎన్నికైనట్టు డీసీవో ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 

అనంతరం నూతన చైర్మన్ వెంకటేశ్వర్లును డైరెక్టర్లు సన్మానించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నూతన చైర్మన్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. వైస్ చైర్మన్ ను మూడు నాలుగు రోజుల్లో ఎన్నుకోనుండగా, రేసులో బండ పద్మ ఉన్నట్టు తెలుస్తోంది. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.శ్రీనివాస్, ఆడిటర్ రంజిత్ కుమార్ రెడ్డి, సీఈవో కె.వరలక్ష్మి పాల్గొన్నారు.