నత్తనడకన డబుల్ బెడ్​రూం ఇండ్ల అప్లికేషన్ల వెరిఫికేషన్​

నత్తనడకన డబుల్ బెడ్​రూం ఇండ్ల అప్లికేషన్ల వెరిఫికేషన్​

‘డబుల్’ ఇండ్లు అప్లికేషన్ల వెరిఫికేషన్ ​డెడ్ ​స్లో

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్​రూం ఇండ్ల అప్లికేషన్ల వెరిఫికేషన్​ ముందుకు సాగడం లేదు. మొదట్లో దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి హడావుడి చేసిన అధికారులు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో తమకు ఇండ్లు వస్తాయో.. రావో అని జనం ఆందోళన చెందుతున్నారు. 2017 నుంచి 2019 వరకు వచ్చిన అప్లికేషన్ల పరిశీలన మొదలై మూడు నెలలైనా ఇప్పటివరకు పూర్తయింది 50శాతం మాత్రమే. బిల్ కలెక్టర్లకు ఇతర పనులు అప్పగించడంతో ఇండ్ల వెరిఫికేషన్ డెడ్​స్లోగా సాగుతోంది. తమ వద్దకు ఏ అధికారి రాలేదని, అప్లై చేసుకున్న టైంలో ఉన్న ఇంట్లో ఇప్పుడు ఉండడం లేదని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమకు ఎవరి నుంచీ ఫోన్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు రాదేమో అనే భయంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పట్లో  అప్లయ్ చేసినవారు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనే విషయాన్ని ఉన్నాధికారులు పట్టించుకోవడంలేదు. దరఖాస్తుదారులు అందుబాటులో లేరని పక్కన పడేస్తున్నారు. ఇంక మాన్యువల్​గా వచ్చిన అప్లికేషన్లు ఉన్నాయో.. లేదో కూడా తెలియదు.

అవే 2 లక్షల అప్లికేషన్లు..
గ్రేటర్​పరిధిలో మొత్తం 7.10 లక్షల అప్లికేషన్లు రాగా వాటికి సంబంధించి ఓటర్ ఐడీ కార్డు, కమ్యూనిటీ వివరాలను అధికారులు యాప్ లో పొందుపరుస్తున్నారు. అయితే కొన్నేండ్ల కిందట దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పటికీ అదే అడ్రస్ లో ఉండడం లేదు. అద్దె ఇండ్లు కావడంతో మారిపోయారు. ఇలాంటి వారిలో కొందరి ఫోన్​నంబర్లు కూడా కలవడం లేదు. ఇలా దాదాపు ఇప్పటికే 2లక్షల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నట్లు సమాచారం. ఈ అప్లికేషన్లకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి కూడా ఎటువంటి ఆదేశాలు రావడం లేదు. ఎక్కువ అప్లికేషన్లు వచ్చిన ఏరియాల పరిధిలోని జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో ఓ కౌంటర్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడికి వచ్చి వివరాలు అందించాలని చెప్పేవారు లేరు. చాలా మంది కౌంటర్లు విషయం తెలియక జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు, కలెక్టరేట్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.