ఈ ఏడాది ఇప్పటి వరకు1000 మంది ఆసుపత్రిపాలు

ఈ ఏడాది ఇప్పటి వరకు1000 మంది ఆసుపత్రిపాలు
 • కనీస సౌలతులు లేక స్టూడెంట్ల కష్టాలు 
 • కొన్ని చోట్లయితే తాగేందుకు నీళ్లు కూడా కరువు
 • ఇంత జరుగుతున్నా స్పందించని సర్కార్​
 • తిండి సక్కగ లేదు.. 
 • జ్వరం వస్తే పట్టించుకునెటోళ్లు లేరు
 • 15 రోజుల్లో ఐదుగురు స్టూడెంట్ల మృతి
 • రోజుకో చోట ఫుడ్​ పాయిజన్.. భోజనంలో కప్పలు, బొద్దింకలు, బల్లులు

నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రంలో గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. స్టూడెంట్లకు కనీస రక్షణ కరువవుతున్నది. జ్వరం వచ్చినా పట్టించుకునే దిక్కు లేకుండాపోతున్నది. సరైన భోజనం అందక, ఫుడ్​ పాయిజన్​తో రోజుకో చోట విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు.  వైరల్​ ఫీవర్స్​, డెంగీ జ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇట్లా 15 రోజుల్లో ఒక్క ఆసిఫాబాద్​ జిల్లాలోనే ఐదుగురు స్టూడెంట్లు మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంతో తమ పిల్లలను హాస్టళ్ల నుంచి ఇండ్లకు తీసుకెళ్తున్నారు. 

ఎలుకలు కరుస్తున్నయ్

గురుకులాలు చాలావరకు కిరాయి బిల్డింగుల్లోనే నడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 281 బీసీ, 192 మైనార్టీ గురుకులాలు ఉండగా, ఒక్కదానికి కూడా సొంత బిల్డింగు లేదు. 180 ఎస్టీ గురుకులాల్లో 30;  268 ఎస్సీ గురుకులాల్లో 150 కిరాయి బిల్డింగులలోనే కొనసాగుతున్నాయి.  400కు పైగా ఉన్న కేజీబీవీలదీ ఇదే పరిస్థితి. 1,700కు పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో చాలావరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆయాచోట్ల సుమారు 4 లక్షలకుపైగా స్టూడెంట్లు చదువుతుండగా, ఎక్కడా స్టూడెంట్ల​ సంఖ్యకు సరిపడా డార్మిటరీలు, డైనింగ్​హాల్స్, వాష్​రూమ్స్​లేవు. చాలా గురుకులాల్లో క్లాస్​రూముల్లోనే తినడం, పడుకోవడం చేస్తున్నారు. తగినన్ని బాత్రూంలు లేకపోవడం, ఉన్నా నీళ్లు రాకపోవడంతో చాలాచోట్ల పిల్లలు రెండు, మూడురోజులకోసారి స్నానం చేస్తున్నారు.

వాష్​రూంలకు డోర్లు లేక..

వాష్​రూంలకు డోర్లు లేక, రోజుల తరబడి క్లీన్ ​చేయక, నల్లాలు పనిచేయక,  బకెట్లతో నీళ్లను మోసుకెళ్లలేక పిల్లలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక చాలా గురుకులాలు, హాస్టళ్లలో అపరిశుభ్ర వాతావరణం, అధ్వాన పరిస్థితుల కారణంగా గదుల్లో ఎలుకలు తిరుగుతున్నాయి. కనీసం మెష్​డోర్లు లేక  దోమలు ప్రబలుతున్నాయి. జులై 31న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో ఏడుగురు స్టూడెంట్లను ఎలుకలు కరిచాయి. మరుసటి రోజు ఆగస్టు 1న సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెం మహాత్మా జ్యోతి రావు ఫూలే బాలికల గురుకుల స్కూల్​హాస్టల్​లో  10 మంది స్టూడెంట్లను ఎలుకలు కరవడంతో ఆసుపత్రిపాలయ్యారు. ఇది మరచిపోకముందే అదే నెల 25న ఖమ్మం జిల్లా కారేపల్లి  మండలంలోని గాంధీనగరం ట్రైబల్​ వెల్ఫేర్​ గురుకుల పాఠశాలలో నిద్రిస్తున్న ఐదుగురు స్టూడెంట్లను  ఎలుకలు కొరికాయి. దీంతో స్టూడెంట్లు గురుకులాలు, హాస్టళ్లలో ఉండాలంటేనే భయపడిపోతున్నారు. 

అన్నంలో కప్పలు, బల్లులు.. 

గురుకులాలు, హాస్టళ్లలో ఉంటూ చదువుతున్న స్టూడెంట్ల తిండి తిప్పలు, ఆరోగ్యంపై సర్కారు ఏమాత్రం శ్రద్ధపెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  రోజుకో చోట ఫుడ్​ పాయిజనింగ్​ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఫుడ్​లో కప్పలు, బల్లులు, పురుగులు వస్తున్నాయి. ఆగస్టు 25న పరిగి ఎస్సీ గురుకులంలో స్టూడెంట్లకు భోజనం వడ్డిస్తుండగా, అందులో కప్ప ప్రత్యక్షమైంది. దీంతో స్టూడెంట్లు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఈ ఘటన మరిచిపోకముందే ఈ నెల 5న వరంగల్​జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో  రాత్రి భోజనంలో బల్లి కనిపించింది. ఆ ఫుడ్​తిన్న 60 మంది స్టూడెంట్లు  ఆసుపత్రిపాలయ్యారు. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్​పాయిజనింగ్​ వల్ల ఏకంగా వెయ్యి మంది దాకా స్టూడెంట్లు ఆసుపత్రి పాలయ్యారు. మరోవైపు అన్ని చోట్లా మిషన్​భగీరథ కింద సురక్షిత తాగునీరు అందిస్తున్నామని చెప్తున్నా చాలా చోట్ల బోరునీళ్లే దిక్కవుతున్నాయి. గత నెల 30న వికారాబాద్​ జిల్లా  కులక్చర్ల మండలం బండవెలికిచెర్లలోని గిరిజన గురుకులంలో కలుషిత నీరు తాగి 120 మంది  అస్వస్థతకు గురయ్యారు. రోజుకో చోట ఫుడ్​ పాయిజన్​, కలుషిత నీటి కారణంగా స్టూడెంట్లు ఆసుపత్రుల పాలవుతున్నా సర్కారు పట్టించుకోకపోవడంతో స్టూడెంట్లు, వాళ్ల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారు.

పారాసిటమాల్​ టాబ్లెట్లు కూడా ఉంటలేవ్

దోమలు విజృంభించి స్టూడెంట్లు వైరల్​ ఫీవర్స్​, డెంగీ జ్వరాల బారిన పడ్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో ఉండే గిరిజన గురుకులాలు, హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా ఉంది. జ్వరం వస్తే అప్పటికప్పుడు ఇచ్చేందుకు  పారాసిటమాల్​లాంటి టాబ్లెట్లకూ దిక్కులేదు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఐటీడీఏ హాస్టళ్లలో 2005లో  అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సుమారు 400 మంది ఏఎన్​ఎంలను నియమించారు. ఈ ఏడాది జూన్​లో వీరి గడువు ముగిసిపోయినప్పటికీ సర్కారు రెన్యువల్​ చేయలేదు. దీంతో స్టూడెంట్ల హెల్త్​ కండీషన్​ను పట్టించుకునేవాళ్లు లేకుండా పోయారు.

ఆసిఫాబాద్​ జిల్లాలో 15 రోజుల్లో ఐదుగురు మృతి

ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూరు మండలం మోగవెళ్లికి చెందిన ఆలం మల్లయ్య, బిచ్చు బాయి దంపతుల కొడుకు రాజేశ్(15)పెంచీకల్ పేట్ మండలం ఎల్లూరులోని ఆశ్రమ గిరిజన పాఠశాల లో టెన్త్ చదువుతున్నాడు. రాజేశ్ కు జ్వరం వచ్చిందని హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. గత నెల  21న తండ్రి మల్లయ్య వచ్చి కొడుకును ఇంటికి తీసుకెళ్లాడు. మరునాడు బెజ్జూరు హస్పిటల్ కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అక్కడ తగ్గకపోవడంతో ఆగస్టు 23న కాగజ్ నగర్ లోని ప్రైవేటు హస్పిటల్ కు తీసుకువచ్చారు. అయినా తగ్గకపోవడంతో మరుసటిరోజుడు (ఆగస్టు 24న) ఆదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తుండగా మృతిచెందాడు. 

 • సిర్పూర్ టీ లోని కాగజ్ నగర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్  స్కూల్ స్టూడెంట్ గోమాసే అశ్విని(11)కి జ్వరం రాగా పేరెంట్స్​కు హాస్టల్ సిబ్బంది ఫోన్ చేయగా తల్లిదండ్రులు కరీంనగర్ లోని హాస్పటల్​కు  తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్ట్ 28న అశ్విని మృతి చెందింది.
 • తిర్యాణి మండలం దేవాయిగూడ గ్రామ పంచాయతీ తోయగూడకు చెందిన టేకం రమేశ్(12) తిర్యాణి ఆశ్రమ స్కూల్​లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 29న సాయంత్రం జ్వరంతో మృతి చెందాడు. 
 • సిర్పూర్ టి మండలం చింతకుంట గ్రామానికి చెందిన సంగీత(19) ఆసిఫాబాద్ లోని బూరుగూడ గిరిజన బాలికల డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సంగీతకు జ్వరం రావడంతో ఆసిఫాబాద్ సర్కారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తగ్గకపోవడంతో కరీంనగర్ లోని ఓ హాస్పిటల్​లో జాయిన్​ చేయగా.. ఆగస్టు 31న  మృతి చెందింది. 
 • కాగజ్ నగర్ లోని కేజీబీవీ  స్టూడెంట్  ఐశ్వర్య మంగళవారం జ్వరంతో చనిపోయింది.