బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనం

బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనం

టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ లు బీజేపీ సభ్యులుగా మారిపోయారు. మరోవైపు బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడుకు టీడీపీ ఫిర్యాదు చేసింది. శుక్రవారం టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, తోట సీతారామలక్ష్మి ఉపరాష్ట్రపతిని నివాసంలో కలిశారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనం చెల్లదని లేఖ అందజేశారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావును అనర్హులుగా ప్రకటించాలని కోరారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం పార్టీల విలీనానికే అవకాశముందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ చెప్పారు. ఎలాంటి సమావేశం జరగకుండా తీర్మానం చేశారని రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్  అన్నారు. విలీన ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన అంశమని గుర్తు చేశారు.