భారత్ వైపు ప్రపంచం చూపు

భారత్ వైపు ప్రపంచం చూపు

న్యూఢిల్లీ: అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలు కేవలం ప్రత్యర్థిగానే చూడాలని, శత్రువులా వ్యవహరించొద్దని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. పోటీలో ఇతరుల కంటే ముందు ఉండేందుకు మనం కష్టపడాలి తప్ప.. ఇతరులను పడదోయకూడదని సూచించారు. దేశానికి వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌గా సేవలందించేందుకు అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి, బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభలో తన వీడ్కోలు ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉప రాష్ట్రపతిగా నన్ను ఎంపిక చేసినట్లు ప్రధాని చెప్పగానే భావోద్వేగానికి లోనయ్యా. నేనేమీ అడగలేదు.. కానీ పార్టీ ఇచ్చింది. దానికి కట్టుబడి పార్టీకి రాజీనామా చేశాను. పార్టీని వీడాల్సి వచ్చినందుకు కన్నీళ్లు ఆగలేదు. ‘‘సభా నిర్వహణలో నా శాయశక్తులా కృషి చేశాను. దక్షిణం, ఉత్తరం, తూర్పు, పశ్చిమం, ఈశాన్య ప్రాంతాలు..ఇలా అన్ని వైపుల వారికీ అవకాశం కల్పించడానికి నేను ప్రయత్నించాను. మీలో ప్రతి ఒక్కరికి సమయం ఇచ్చాను” అని సభ్యులను ఉద్దేశించి అన్నారు. ఇండియాను మొత్తం ప్రపంచం చూస్తున్నదని, రాజ్యసభ ఎంపీలు సభ గౌరవం, మర్యాదను కాపాడాలని కోరారు. ‘‘పార్లమెంటు సజావుగా సాగాలన్నదే నా కోరిక. మీ ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని తన ప్రసంగాన్ని ముగించారు.


 
వెంకయ్య  జీవిత ప్రస్థానం    

1949 జులై 1న నెల్లూరు జిల్లా చవటపాలెంలో వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు,  రమణమ్మ దంపతులకు ముప్పవరపు వెంకయ్య నాయుడు జన్మించారు. నెల్లూరులోని బీఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. కాలేజీలో ఉండగానే ఏబీవీపీలో చేరారు. ఆంధ్రా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీల స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పని చేశారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో కీలకంగా పని చేశారు. 1977లో జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.1978లో నెల్లూరులోని ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో మరోసారి గెలిచారు. 1980లో అఖిల భారతీయ జనతా పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1985లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1988లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1993లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1996 నుంచి 2000 దాకా బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేశారు.1998లో కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2002 జులై నుంచి 2004 అక్టోబర్ దాకా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిలో కొనసాగారు. 2005లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయ్యారు. 2017 జులైలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో తన మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. 2022 ఆగస్టు దాకా ఐదేండ్ల పాటు ఉప రాష్ట్రపతిగా కొనసాగారు.