
- కొడుకు మృతిపై అనుమానిస్తూ బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు
- నెలరోజులైనా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆందోళన
- నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం స్టేషన్ ఎదుట ఘటన
సంస్థాన్ నారాయణపురం, వెలుగు: కొడుకు మృతిపై అనుమానం ఉందని విచారణ చేయాలని కంప్లయింట్ ఇచ్చి నెలరోజులైనా పోలీసులకు పట్టించుకోవట్లేదని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన దిగారు. పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలని గురువారం నిరసన తెలిపిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం మండలం కేలోతు తండాకు చెందిన కేడోతు వరుణ్ తేజ్(18), గత నెల16న బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పదంగా చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కొట్టిచంపి ఉంటారని అనుమానిస్తూ సంస్థాన్ నారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశామని మృతుడి తల్లిదండ్రులు కేడోతు నీల,రాముడు, బంధువులు పేర్కొన్నారు. నెలరోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎస్ఐ జగన్ పట్టించుకోవడం లేదని వాపోయారు.
న్యాయం జరిగే వరకు స్టేషన్ లోంచి వెళ్లమని, ఇప్పటికైనా పోలీసులు స్పందించకుంటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిం చారు. వెంటనే ఏఎస్ఐ స్పందించి మృతుడి తల్లి చేతిలోని పెట్రోల్ బాటిల్ లాక్కొన్నా డు. ఘటనపై ఎస్ఐ జగన్ ను వివరణ కోరగా బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వరుణ్ డెడ్ బాడీపై ఎలాంటి దెబ్బలు కనిపించలేదని, పోస్టుమార్టంలోనూ మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని రిపోర్టు వచ్చిందని చెప్పారు.